T20 World Cup 2021 Aus Vs SA: టి20 ప్రపంచకప్ సూపర్–12 ఆరంభ పోరులో ఆస్ట్రేలియా అతికష్టమ్మీద గెలిచింది. లక్ష్యం చిన్నదే అయినా ఛేదనలో కిందా మీదా పడిన ఆసీస్... స్టొయినిస్ (16 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు), మాథ్యూ వేడ్ (10 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) పట్టుదలగా ఆడటంతో దక్షిణాఫ్రికాపై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఈ మెగా ఈవెంట్‌లో శుభారంభం చేసింది. గ్రూప్–1లో భాగంగా శనివారం అబుదాబిలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు చేసింది.
మార్క్‌రమ్ (36 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన బ్యాటర్స్ విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ హేజల్‌వుడ్, మిషెల్ స్టార్క్, ఆడమ్ జంపా తలా రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ఆ్రస్టేలియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసి గెలిచింది. స్టీవ్ స్మిత్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు) రాణించాడు. నోర్జేకు రెండు వికెట్లు దక్కాయి.
రాణించిన బౌలర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు. స్టార్క్ వేసిన తొలి ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన కెప్టెన్ బవూమ (7 బంతుల్లో 12; 2 ఫోర్లు) దూకుడు మీద కనిపించాడు. అయితే మరుసటి ఓవర్లోనే మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత హేజల్‌వుడ్ తన వరుస ఓవర్లలో వాన్ డెర్ డసెన్ (3 బంతుల్లో 2), క్వింటన్ డికాక్ (12 బంతుల్లో 7; ఫోర్)లను అవుట్ చేశాడు. మరికాసేపటికే క్లాసెన్ (13 బంతుల్లో 13; 2 ఫోర్లు) కూడా పెవిలియన్‌కు చేరడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది.
ఈ దశలో డేవిడ్ మిల్లర్ (18 బంతుల్లో 16)తో కలిసి మార్క్‌రమ్ జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. 14వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన ఆడమ్ జంపా ఒకే ఓవర్‌లో మిల్లర్, ప్రిటోరియస్ (1)లను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత మార్క్‌రమ్ కూడా అవుటవ్వడంతో దక్షిణాఫ్రికా 120 మార్కును కూడా అందుకోలేకపోయింది.
గెలిపించిన స్టొయినిస్
పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో ఆ్రస్టేలియా ఛేదన సాఫీగా సాగలేదు. ఆస్ట్రేలియా టాప్–3 బ్యాటర్స్ వార్నర్ (15 బంతుల్లో 14, 3 ఫోర్లు), కెపె్టన్ ఫించ్ (0), మిషెల్ మార్‡్ష (17 బంతుల్లో 11; 1 ఫోర్) విఫలమయ్యారు. స్మిత్, మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 18; 1 ఫోర్) నిలబడటంతో కంగారూ జట్టు లక్ష్యం వైపు కదిలింది. అయితే మార్క్‌రమ్ సూపర్ క్యాచ్‌తో స్మిత్‌ను అవుట్ పెవిలియన్‌కు చేర్చాడు. కేశవ్ మహరాజ్ వేసిన 15వ ఓవర్ ఐదో బంతిని స్మిత్ మిడ్ వికెట్ దిశలో గాల్లోకి ఆడగా... లాంగాన్‌లో ఉన్న మార్క్‌రమ్ తన కుడివైపునకు పరుగెత్తుకుంటూ వెళ్లి అద్భుతమైన డైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు.
రెండు బంతుల అనంతరం షమ్సీ బౌలింగ్‌లో స్విచ్ హిట్‌కు ప్రయతి్నంచిన మ్యాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఛేదనలో ఆసీస్ మరోసారి దారి తప్పింది. చివరి రెండు ఓవర్లలో ఆస్ట్రేలియా విజయ సమీకరణం 12 బంతుల్లో 18 పరుగులుగా మారింది. క్రీజులో ఉన్న స్టొయినిస్ 19వ ఓవర్‌లో ఒక ఫోర్... 20వ ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాది రెండు బంతులు మిగిలి ఉండగానే ఆసీస్‌ను గట్టెక్కించాడు. వేడ్‌తో కలిసి స్టొయినిస్ అజేయమైన ఆరో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు.
స్కోర్లు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవూమ (బి) మ్యాక్‌వెల్ 12; డికాక్ (బి) హేజల్‌వుడ్ 7; డసెన్ (సి) వేడ్ (బి) హేజల్‌వుడ్ 2; మార్క్‌రమ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 40; క్లాసెన్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 13; మిల్లర్ (ఎల్బీ) (బి) జంపా 16; ప్రిటోరియస్ (సి) వేడ్ (బి) జంపా 1; కేశవ్ మహరాజ్ (రనౌట్) 0; రబడ (నాటౌట్) 19; నోర్జే (సి) ఫించ్ (బి) స్టార్క్ 2; షమ్సీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 118.
వికెట్ల పతనం: 1–13, 2–16, 3–23, 4–46, 5–80, 6–82, 7–83, 8–98, 9–115. బౌలింగ్: స్టార్క్ 4–0–32–2, మ్యాక్స్‌వెల్ 4–0–24–1, హేజల్‌వుడ్ 4–1–19–2, కమిన్స్ 4–0–17–1, జంపా 4–0–21–2.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (సి) రబడ (బి) నోర్జే 0; వార్నర్ (సి) క్లాసెన్ (బి) రబడ 14; మార్‡్ష (సి) డసెన్ (బి) కేశవ్ మహరాజ్ 11; స్మిత్ (సి) మార్క్‌రమ్ (బి) నోర్జే 35; మ్యాక్స్‌వెల్ (బి) షమ్సీ 18; స్టొయినిస్ (నాటౌట్) 24; వేడ్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 121.
వికెట్ల పతనం: 1–4, 2–20, 3–38, 4–80, 5–81. బౌలింగ్: రబడ 4–0–28–1, నోర్జే 4–0–21–2, కేశవ్ మహరాజ్ 4–0–23–1, షమ్సీ 4–0–22–1, ప్రిటోరియస్ 3.4–0–26–0.
చదవండి: T20 World Cup Ind Vs Pak: అతడిని ఒక బ్యాట్స్‌మన్‌గా కూడా ఆడించగలం: విరాట్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment