
ఢాకా: వచ్చే నెలలో ఒమన్, యూఏఈలలో జరిగే టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో తాను పాల్గొనడంలేదని బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ప్రకటించాడు. మోకాలి గాయం కారణంగా గత ఐదు నెలలుగా తమీమ్ ఆటకు దూరంగా ఉన్నాడు. దీంతో స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియా సీరిస్‌కు దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మార్గదర్శకాల ప్రకారం, సెప్టెంబర్ 10 లోపు అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాలి.
కొన్ని దేశాలు తమ జట్లను కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమీమ్ ఇక్బాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. టి20 ప్రపంచ కప్ జట్టులో నేను ఉండాలని అనుకోవడం లేదని..నా స్థానంలో ఎవరు వచ్చినా న్యాయం చేకూరుతుందని భావిస్తున్నాను’ అని చెప్పారు. అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన ఏకైక బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్‌గా తమీమ్ పేరిట రికార్డు ఉంది. ఇప్పటివరకు 74 టి20 మ్యాచ్‌లు ఆడి 1,701 పరుగులు చేశాడు. కాగా బంగ్లాదేశ్ టి20 ప్రపంచకప్‌లో సూపర్12 కు అర్హత సాధించడానికి గ్రూప్ B లో స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్ తో తలపడనుంది.
చదవండి: పాల్ స్టిర్లింగ్ మెరుపు సెంచరీ.. ఐర్లాండ్ ఘనవిజయం