T20 World Cup 2022- Semi Finalists Predictions: టీమిండియా ఈసారి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఆకాంక్షించాడు. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్-2022 చాంపియన్‌గా నిలిస్తే చూడాలని ఉందన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా ఇప్పటికే ఈ మెగా టోర్నీ ఆరంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సూపర్-12 దశలో అక్టోబరు 23న దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది.
ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయాల కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీ వార్మప్ మ్యాచ్‌లో చెలరేగిన విధానం కాస్త ఊరటనివ్వగా.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల విరాట్ కోహ్లికి తోడు.. సూర్యకుమార్ అద్భుత ఫామ్‌లో ఉండటం సానుకూలంగా మారింది.
ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ ఈవెంట్‌లో టీమిండియాతో పాటు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సహా పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా గట్టిపోటీనిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సచిన్ టెండుల్కర్ సెమీస్ చేరే జట్లను అంచనా వేశాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌స్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇండియా చాంపియన్‌గా నిలవాలని నేను బలంగా కోరుకుంటున్నా.
నా అభిప్రాయం ప్రకారం ఇండియాతో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టాప్-4లో ఉంటాయి. అయితే, న్యూజిలాండ్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. కివీస్ డార్క్ హార్స్(అనూహ్యంగా పుంజుకుంటుదన్న ఉద్దేశంలో)గా పరిణమించే అవకాశం ఉంది. మరోవైపు సౌతాఫ్రికాను తీసిపారేయడానికి వీల్లేదు. సెప్టెంబరు- అక్టోబరు మధ్య కాలంలో స్వదేశంలో కూడా వారికి ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. పిచ్‌లను వాళ్లు అంచనా వేయగలరు’’ అని చెప్పుకొచ్చాడు.
కాగా గతేడాది ప్రపంచకప్ టోర్నీలో కోహ్లి సేన కనీసం సెమీస్ చేరకుండానే వెనుదిరిగిన విషయం తెలిసిందే. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా చాంపియన్‌గా నిలవగా.. ఫైనల్లో పరాభవంతో న్యూజిలాండ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
చదవండి: T20 WC 2022: ప్రపంచకప్ తర్వాత టీ20లకు కోహ్లి గుడ్‌బై? అంతలేదు.. వచ్చే వరల్డ్‌కప్‌లో కూడా
Dushmanta Chameera T20 WC 2022: ఎదురుదెబ్బ.. లంకను గెలిపించిన స్టార్ బౌలర్ దూరం
Comments
Please login to add a commentAdd a comment