టీ20 వరల్డ్‌కప్‌లో భిన్న పరిస్థితి | T20 World Cup 2024: Afghanistan, USA, Scotland Tops The Points Table In Respective Groups As On 8th June | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌లో భిన్న పరిస్థితి

Published Sat, Jun 8 2024 6:25 PM | Last Updated on Sat, Jun 8 2024 6:49 PM

T20 World Cup 2024: Afghanistan, USA, Scotland Tops The Points Table In Respective Groups As On 8th June

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో గతానికి భిన్నంగా చిన్న జట్ల హవా కొనసాగుతుంది. ఫలితంగా 15 మ్యాచ్‌లు పూర్తైనా అగ్ర జట్లు తమ తమ గ్రూప్‌ల్లో టాప్‌ ప్లేస్‌కు చేరుకోలేకపోయారు. చిన్న జట్లు అనూహ్య రీతిలో రాణించి పెద్ద జట్లను ఓడించడంతో వాటిదే పైచేయిగా ఉంది. 

గ్రూప్‌-ఏ నుంచి తొలి ప్రపంచకప్‌ ఆడుతున్న యూఎస్‌ఏ.. పాకిస్తాన్‌ సహా కెనడాపై సంచలన విజయాలు సాధించి గ్రూప్‌ టాపర్‌గా ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో, కెనడా మూడో ప్లేస్‌లో ఉన్నాయి. ఆడిన ఓ మ్యాచ్‌లో ఓడిన పాక్‌ నాలుగో స్థానంలో ఉండగా.. రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఐర్లాండ్‌ ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. యూఎస్‌ఏ చేతిలో ఓటమి నేపథ్యంలో పాక్‌ సూపర్‌-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

గ్రూప్‌-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ లాంటి హేమాహేమీ జట్లు ఉండగా.. ఎవరు ఊహించని విధంగా ఈ గ్రూప్‌లో స్కాట్లాండ్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంది. స్కాట్లాండ్‌ ఓ మ్యాచ్‌లో గెలిచి (నమీబియా), మరో మ్యాచ్‌ రద్దు కావడంతో (ఇంగ్లండ్‌) 3 పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా ఉంది. ఆసీస్‌, నమీబియా, ఇంగ్లండ్‌, ఒమన్‌ రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

గ్రూప్‌-సిలో సంచలనాల ఆఫ్ఘనిస్తాన్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. తాజాగా ఆ జట్టు చేతిలో చావుదెబ్బ తిన్న న్యూజిలాండ్‌ ఆఖరి స్థానంలో నిలిచింది. వెస్టిండీస్‌, ఉగాండ, పపువా న్యూ గినియా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి.

గ్రూప్‌-డి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌ నుంచి సూపర్‌-8 బెర్త్‌ రేసులో ముందుండాల్సిన శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి చిట్ట చివరి స్థానంలో ఉండగా.. ఆడిన ఒక్క మ్యాచ్‌లో గెలిచిన సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఓడిన నేపాల్‌ నాలుగో స్థానంలో ఉంది.

ప్రపంచకప్‌లో ఇవాళ (జూన్‌ 8) మరో మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. గ్రూప్‌-డి నుంచి నెదర్లాండ్స్‌, సౌతాఫ్రికా.. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌.. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఉగాండ పోటీపడనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఊహించిన ఫలితాలు వచ్చినా ఆఫ్ఘనిస్తాన్‌, యూఎస్‌ఏ, స్కాట్లాండ్‌ జట్లు ఆయా గ్రూప్‌ల్లో టాప్‌లోనే కొనసాగుతాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement