Photo: Irfan Pathan
Irfan Pathan Comments On Varun Chakravarthy: రానున్న టీ20 వరల్డ్‌కప్‌లో యువ ఆటగాడు వరుణ్ చక్రవర్తి టీమిండియాకు కీలకంగా మారనున్నాడని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం అతడికి ప్రయోజనకరంగా మారనుందని పేర్కొన్నాడు. అయితే, తొలి ప్రపంచకప్ ఆడే సమయంలో ఒత్తిడికి గురవడం సహజమని, దానిని అధిగమిస్తే సత్ఫలితాలు పొందవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌నకై ప్రకటించిన జట్టులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు దక్కిన విషయం విదితమే.
ఇక ఐపీఎల్-2021లో భాగంగా యూఏఈ వేదికగా సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ వరుణ్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మాక్స్‌వెల్, సచిన్ బేబి, వనిందు హసరంగ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తొమ్మిది వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వరుణ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... ‘‘వరల్డ్‌కప్‌లో తను కీలకంగా మారే అవకాశం ఉంది. నిజానికి అంతర్జాతీయ క్రికెట్‌కు... లీగ్ మ్యాచులకు తేడా ఉంటుంది. ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఐపీఎల్ ఆడటం వల్ల కావాల్సినంత ప్రాక్టీసు దొరుకుతుంది. వరుణ్ కూడా అంతే. నిజానికి వన్డే వరల్డ్ కప్ 2011 సమయంలో జహీర్ ఖాన్ నకుల్ బాల్ వేయడం మొదలుపెట్టాడు. అదొక ఆశ్చర్యకరమైన డెలివరీ. ఇలాంటి సర్‌ప్రైజ్ ఫ్యాక్టర్ కచ్చితంగా బౌలర్‌కు మేలు చేస్తుంది.
కొత్త విషయాలు కనుగొనడం బౌలర్లకు ఉపయుక్తంగా ఉంటాయి. బహుశా వరుణ్ చక్రవర్తి నుంచి కూడా ఇదే తరహాలో ఏవైనా కొత్త డెలివరీలు ఊహించవచ్చేమో’’ అని పేర్కొన్నాడు. కాగా ఫాస్ట్ బౌలర్లు తమ వేగాన్ని(బంతి) ఒక్కసారిగా తగ్గించి బ్యాట్స్‌మెన్‌ను తికమక పెట్టేందుకు విసిరే బంతిని నకుల్‌బాల్‌గా పేర్కొంటారన్న సంగతి తెలిసిందే. కాగా అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. కాగా ఇటీవలి శ్రీలంక పర్యటనతో వరుణ్ చక్రవర్తి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2021 2nd Phase: అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆటగాళ్లు వీరే
Comments
Please login to add a commentAdd a comment