
టీ20 వరల్డ్‌కప్ జట్టులో అశ్విన్.. సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు
Sunil Gavaskar Comments On Ravi Ashwin T20 WC: రానున్న టీ20 వరల్డ్‌కప్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు కల్పించడం ప్రోత్సాహక బహుమతి లాంటిదని టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆడించలేకపోయిన కారణంగానే ఈ స్టార్ స్పిన్నర్‌ను మెగా టోర్నీకి ఎంపిక చేశారమోనని అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడే జట్టులో అశ్విన్‌కు స్థానం దక్కిన సంగతి తెలిసిందే.
అయితే, టీమిండియా ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ అతడిని పక్కనపెట్టేశారు. ప్రధాన స్పిన్నర్ అయిన అశ్విన్‌కు కోహ్లి ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోడంతో విమర్శలు వెల్లువెత్తాయి. కావాలనే అతడికి అవకాశం ఇవ్వడం లేదంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ ఆడబోయే జట్టును ఇటీవల ప్రకటించిన బీసీసీఐ అశ్విన్ పేరును కూడా చేర్చడం గమనార్హం. 15 మంది ప్రాబబుల్స్‌లో అతడికి చోటిచ్చింది.
ఈ నేపథ్యంలో సునీల్ గావస్కర్ స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ.. ‘‘అశ్విన్ జట్టులోకి తిరిగి రావడం మంచి విషయం. అయితే, అతడికి తుదిజట్టులో చోటు ఉంటుందా లేదా అనేదే అసలు ప్రశ్న. ఇంగ్లండ్ టూర్‌లో ఆడే అవకాశం ఇవ్వనందుకే 15 మందిలో ఒకడిగా తనను ఎంపిక చేశారా? నిరాశ చెందిన అతడికి ఊరట కలిగించేందుకు ఇలా ప్రోత్సాహక బహుమతి ఇచ్చారా? టీ20 వరల్డ్‌కప్‌లో తను ఆడతాడా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది’’ అని వ్యాఖ్యానించాడు.
కాగా టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అశ్విన్ పేరొందాడు. ఇప్పటి వరకు 46 మ్యాచ్‌లు ఆడిన అతడు 52 వికెట్లు తీశాడు. ఇక చివరిసారిగా 2017లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అశూ టీ20 మ్యాచ్ ఆడాడు. ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లి సేన 2-1తో ఆధిక్యంలో ఉండగా.. కోవిడ్ కారణంగా ఐదో మ్యాచ్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. రీషెడ్యూల్ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
టీ20 ప్రపంచకప్ భారత జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్.
చదవండి: Sheldon Jackson: అంతా గంభీర్ భయ్యా వల్లే.. లేదంటే రోడ్డు మీద పానీపూరీ అమ్ముకునేవాడిని