
Rohan Bopanna Ramkumar- పుణే: దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్ టాటా ఓపెన్‌లో భారత సీనియర్ స్టార్ రోహన్ బోపన్న, యువతార రామ్‌కుమార్ రామనాథన్ మెరిశారు. వీరిద్దరు జతగా బరిలోకి దిగి టాటా ఓపెన్ డబుల్స్ విభాగంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 6–7 (10/12), 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ లూక్ సావిల్లె–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై సంచలన విజయం సాధించింది.
బోపన్న–రామ్ జంటకు 16,370 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 12 లక్షల 22 వేలు)లభించింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట ఏడు ఏస్‌లు సంధించి ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఈ ఏడాది బోపన్న–రామ్ జోడీకిది రెండో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. గత నెలలో అడిలైడ్ ఓపెన్‌లోనూ బోపన్న–రామ్ జంట విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా బోపన్న కెరీర్‌లో ఇది 21వ డబుల్స్ టైటిల్‌కాగా రామ్ ఖాతాలో ఇది రెండో డబుల్స్ టైటిల్.
Comments
Please login to add a commentAdd a comment