టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను వన్డే వరల్డ్‌కప్ సమయానికంతా సిద్ధంగా ఉంచాలన్న విషయంలో బీసీసీఐ ప్రణాళిలను మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఐర్లాండ్ సిరీస్ కోసమని తొందరపడి బుమ్రాను టీమిండియాకు ఎంపిక చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. వరల్డ్‌కప్ జరుగనున్న ఏడాదిలో బుమ్రాను హడావుడిగా జాతీయ జట్టులోకి తీసుకురావడం మానుకోవాలని సూచించాడు.
ప్రిపరేషన్‌లో భాగమని బుమ్రాను ఐర్లాండ్ సిరీస్ బరిలోకి దించితే.. అతను మరో నాలుగు నెలల పాటు ఇంటి దగ్గరే కూర్చోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. ఈ సమయంలో బుమ్రా మరోసారి గాయం బారిన పడితే టీమిండియాకు తీవ్రనష్టం జరుగుతుందని, అందుకే బీసీసీఐ తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలని అన్నాడు.
పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది విషయంలో పీసీబీ సైతం ఇలాగే తొందరపడిందని, దాని కారణంగా అతను చాలాకాలం పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉండటాన్ని మనం చూశామని చెప్పుకొచ్చాడు. పేసర్ల విషయంలో మేనేజ్‌మెంట్ ఆచితూచి అడుగులు వేస్తేనే బాగుంటుందని, ఈ విషయంలో నిర్ణయాలు మిస్ ఫైర్ అయితే అవి జట్టును దారుణంగా దెబ్బకొడతాయని తెలిపాడు.
కాగా, వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా ఆగస్టులో ఐర్లాండ్‌తో జరుగనున్న సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి పై పేర్కొన్న కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇదిలా ఉంటే, జాతీయ సెలెక్టర్లు కొద్దిరోజుల కిందటే వెస్టిండీస్ పర్యటన నిమిత్తమం టీమిండియాను ప్రకటించారు. విండీస్ పర్యటనలో టెస్ట్, వన్డేల కోసం వేర్వేరు జట్లను ఎంపిక చేశారు. జులై 12 నుంచి ప్రారంభంకానున్న విండీస్ టూర్‌లో తొలుత టెస్ట్‌లు, అనంతరం వన్డే, టీ20 సిరీస్‌లు జరుగనున్నాయి. టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది.
విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment