బ్రిస్బేన్: ఒక ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్.. 96 ఏళ్ల తర్వాత ఒక్క ఆటగాడు కూడా డబుల్ డిజిట్ దాటలేక చతికిలపడ్డారన్న అపఖ్యాతి.. టీమిండియా రన్ మెషీన్, టెస్టుల్లో చారిత్రక విజయాలు సాధించిపెట్టిన కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలో మునుపెన్నడూ లేనటువంటి ఘోర ఓటమి.. పింక్ బాల్ టెస్టు (రెండో ఇన్నింగ్స్)లో టీమిండియాకు ఎదురైన చేదు అనుభవాలు.. తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయినందుకు విమర్శలు.. పైగా ఈ మ్యాచ్ తర్వాత పితృత్వ సెలవుపై కోహ్లి స్వదేశానికి రావడంతో ఇక భారత్‌పై మరింత ఒత్తిడి పెరుగుతుంది.. కెప్టెన్‌తో పాటు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి జట్టుకు దూరం కావడంతో సిరీస్‌పై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దనే కామెంట్లు వినిపించాయి.
కానీ బాక్సింగ్ డే టెస్టు నాటికి సీన్ మారింది. విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ వంటి ముఖ్యమైన ఆటగాళ్లు దూరమైనప్పటికీ అజింక్య రహానే సారథ్యంలోని జట్టు సమిష్టి కృషితో ఆసీస్‌ను మట్టికరిపించింది. అడిలైడ్ టెస్టు పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్(ఐదు వికెట్లు) , బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ 80(45+35) అద్భుత ఇన్నింగ్స్‌తో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.(చదవండి: సంచలన విజయం: నంబర్ 1గా టీమిండియా)
అయితే సిడ్నీ టెస్టు నాటికి టీమిండియాను గాయాల బెడద ఎక్కువైంది. పేసర్ ఉమేశ్ యాదవ్ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో నవదీప్ సైనీ సంప్రదాయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆసీస్ అరంగేట్ర ఆటగాడు పకోవ్‌స్కీ వికెట్ తీసి ఖాతా తెరిచిన సైనీ ఆ తర్వాత కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక మూడో టెస్టులో హనుమ విహారి స్లో ఇన్నింగ్స్‌కు తోడు జడేజా సూపర్ ఫీల్డింగ్, అశ్విన్ సమయోచితమైన ఇన్నింగ్స్‌తో ఆ మ్యాచ్‌ను భారత్ డ్రాగా ముగించింది.
అసలు జరుగుతుందా లేదా?
ఇక ఆస్ట్రేలియాలో కరోనా విజృంభణ నేపథ్యంలో చివరిదైన నాలుగు టెస్టు జరుగుతుందా లేదా అన్న అంశంపై అనుమానాలు తలెత్తిన సంగతి తెలిసిందే. బ్రిస్బేన్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించడంతో కఠిన నిబంధనలు అమలు చేయడం, ఇందుకు భారత ఆటగాళ్లు విముఖంగా ఉన్నారంటూ స్థానిక మీడియాలో వార్తలు రావడం వంటి పరిణామాలు జరిగాయి. కొందరు ఆసీస్ మాజీ ఆటగాళ్లైతే గబ్బాలో భారత్‌కు మంచి రికార్డు లేదు కాబట్టే ఆడటానికి వెనుకాడుతున్నారంటూ విమర్శలు సైతం గుప్పించారు.
ఇలాంటి తరుణంలో బ్రిస్డేన్‌లో ఆతిథ్య జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని భారత్ అనూహ్య రీతిలో ఛేదించింది. బుమ్రా, జడేజా, అశ్విన్ వంటి సీనియర్ల గైర్హాజరీలో సిరాజ్, శార్దూల్ ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఆటకట్టించగా.. రిషభ్ పంత్ దూకుడైన ఆటకు.. పుజారా డిఫెన్స్ తోడవడంతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. తద్వారా 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆసీస్‌కు గట్టి షాకిచ్చి చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది.
అదరగొట్టిన అరంగేట్ర ఆటగాళ్లు
ఈ సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ (మెల్‌బోర్న్), నవదీప్ సైనీ (సిడ్నీ), వాషింగ్టన్ సుందర్ (బ్రిస్బేన్), టి.నటరాజన్ (బ్రిస్బేన్) సత్తా చాటి నవతర జట్టు కూడా మరింత పటిష్టంగా ఉంటుందనే భరోసానిచ్చారు. కోహ్లి, కేఎల్ రాహుల్, షమీ, ఉమేశ్ యాదవ్, బుమ్రా, జడేజా, అశ్విన్ కీలక మ్యాచుల్లో లేకపోయినప్పటికీ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో ఈ యువ ఆటగాళ్లతో పాటు వారి నైపుణ్యాలను సక్రమంగా ఉపయోగించుకుని చారిత్రక విజయం అందించిన రహానేపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఆసీస్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ క్రికెటర్లు అంతగా ఆకట్టుకోకవపోవడం.. మిచెల్ స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్, లయన్ వంటి కీలక బౌలర్లు నాలుగు టెస్టులు ఆడినప్పటికీ బోర్డర్- గావస్కర్ సిరీస్‌ను వరుసగా రెండోసారి భారత్‌కు సమర్పించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment