
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో శ్రీలంక మాస్టర్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. వడోదర వేదికగా ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో శ్రీలంక రెండో స్ధానానికి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో షాన్ మార్ష్(49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 77), బెన్ డంక్(29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో మెరిశారు.
అతడితో పాటు డానియల్ క్రిస్టియన్(34), కటింగ్(19) పరుగులతో రాణించారు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఆసీస్ కెప్టెన్ షేన్ వాట్సన్.. శ్రీలంకపై మాత్రం కేవలం 16 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. లంక బౌలర్లలో గుణరత్నే, ఉదనా, చతురంగ డిసిల్వా తలా వికెట్ సాధించారు.
తరంగ విధ్వంసం..
అనంతరం 218 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఆసీస్ బౌలర్లను తరంగా ఉతికారేశాడు. కేవలం 54 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు.
అతడితో పాటు లహిరు తిరమానే(34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ బెన్ లాఫ్లిన్ మూడు వికెట్లు పడగొట్టగా.. డానియల్ క్రిస్టియన్ రెండు, జేవియర్ డోహెర్టీ ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ టోర్నీలో భాగంగా శనివారం వడోదర వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడున్నాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మంచి జోష్ మీద ఉన్న సచిన్ సేన.. అదే జోరును ఇంగ్లండ్ మాస్టర్స్‌పై కొనసాగించాలని భావిస్తోంది.