
జహీర్ ఖాన్.. టీమిండియా బౌలింగ్ దళానికి దశాబ్దానికి పైగా నాయకత్వం వహించాడు. 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్ 92 టెస్టుల్లో 311, 200 వన్డేల్లో 282, 17 టీ20ల్లో 17 వికెట్లు తీశాడు. 2011 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో జహీర్ పాత్ర కూడా చాలా ఉంది. ఆ ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లాడిన జహీర్ 21 వికెట్లు తీశాడు. ముఖ్యంగా జహీర్ 2006 నుంచి 2014 వరకు భారత జట్టుకు ప్రధాన బౌలర్‌గా వ్యవహరించాడు. (చదవండి : డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్)
తాజాగా ఐసీసీ జహీర్ ఖాన్‌కు సంబంధించి త్రో బ్యాక్ థర్స్‌డే పేరిట ఒక వీడియోనూ ట్విటర్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ .. టీమిండియా బౌలింగ్ కొనసాగుతుంది. అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వా క్రీజులో ఉన్నాడు... బంతి టీమిండియా బౌలర్ జహీర్ ఖాన్ చేతిలో ఉంది. జహీర్ వేసిన బంతి బులెట్ వేగంతో దూసుకొచ్చి వికెట్లను గిరాటేయడంతో స్టీవా దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఆ వేగం ఎంత అంటే.. బంతి దాటికి మూడు వికెట్లు చెల్లాచెదురయ్యాయి. అయితే ఈ మ్యాచ్ ఏ టోర్నీలో జరిగింది.. ఏ సంవత్సరం జరిగిందో చెప్పాలంటూ క్యాప్షన్ జత చేసింది. చాలా మంది నెటిజన్లు ఆ మ్యాచ్ 2000వ సంవత్సరం.. ఐసీసీ నాకౌట్ చాంపియన్స్ ట్రోపీలో జరిగిందని కామెంట్లు చేశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐసీసీ నాకౌట్ చాంపియన్స్ ట్రోపీలో క్వార్టర్ ఫైనల్లో ఆసీస్, టీమిండియా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 46.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. పాంటింగ్ 46, మైఖెల్ బెవన్ 42 పరుగులు చేయగా.. మిగతవారు విఫలం కావడంతో 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెన్యాలో జరిగిన ఈ టోర్నీలో న్యూజిలాండ్, భారత్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. కాగా ఫైనల్లో కివీస్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలి మేజర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా ఈ టోర్నీ ద్వారానే జహీర్ ఖాన్‌తో పాటు డాషింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు.
#ThrowbackThursday ➜ When a young Zaheer Khan went through the gate of an experienced Steve Waugh!
— ICC (@ICC) December 31, 2020
What a peach 🔥
Can you guess this game and year? 😉 pic.twitter.com/BQfGlr0FAR