ODI Rankings: ఐసీసీ తాజాగా (మే 11) విడుదల చేసిన వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్.. టీమిండియాను వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకగా, ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని కాపాడుకుంది. గడిచిన వారం రోజులుగా టాప్ త్రీ జట్ల మధ్య దోబూచులాట ఆడుతున్న అగ్రస్థానం.. వార్షిక అప్‌డేట్ తర్వాత ఆసీస్ ఖాతాలోకి చేరింది. ప్రస్తుతానికి ఆసీస్ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నప్పటికీ.. పాయింట్ల పరంగా చేస్తే, ఆ స్థానం శాశ్వతం కాదని తెలుస్తోంది.
టాప్ త్రీలో ఉన్న ఆసీస్, పాక్, భారత్‌ల మధ్య వ్యత్యాసం కేవలం 3 పాయింట్లు మాత్రమే. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 118, పాక్ ఖాతాలో 116, భారత్ ఖాతాలో 115 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో ఆసీస్, పాక్, భారత్‌ల తర్వాత న్యూజిలాండ్ (104), ఇంగ్లండ్ (101), సౌతాఫ్రికా (101), బంగ్లాదేశ్ (97), ఆఫ్ఘనిస్తాన్ (88), శ్రీలంక (80), వెస్టిండీస్ (72) వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచాయి. కాగా, తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న పాక్.. గడిచిన వారం రోజుల వ్యవధిలో టాప్-3 ర్యాంక్‌ల్లో నిలువడం విశేషం.
కివీస్‌తో ఆఖరి వన్డేకు ముందు టాప్ ర్యాంక్‌కు చేరిన పాక్.. 48 గంటల వ్యవధిలో మూడో స్థానానికి పడిపోయింది (ఆఖరి వన్డేలో కివీస్ చేతిలో ఓటమితో). తాజాగా వార్షిక అప్‌డేట్ తర్వాత విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో దాయాది దేశం రెండో స్థానానికి ఎగబాకింది.
ఇదిలా ఉంటే, ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాక్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్ (వన్డే ఫార్మాట్) పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. వేదిక మార్పు విషయంలో పాక్ మినహా అన్ని జట్లు తలో మాట చెబుతున్నాయి. సగం మ్యాచ్‌లు (భారత్ ఆడే మ్యాచ్‌లు) యూఏఈలో, మిగతా మ్యాచ్‌లు తమ దేశంలో నిర్వహించేందుకు పాక్ అంగీకారం తెలుపగా.. తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు తాము యూఏఈలో అడుగుపెట్టేదే లేదని మొండికేస్తున్నాయి. టోర్నీ సమయానికి యూఏఈలో ఎండలు భీభత్సంగా ఉంటాయని ఆ జట్లు సాకుగా చూపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆసియా కప్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
చదవండి: వన్డే ప్రపంచకప్.. భారత్ తొలి మ్యాచ్ ఎవరితో అంటే? మరి పాక్‌తో
Comments
Please login to add a commentAdd a comment