PAK vs NZ, 5th ODI: Pakistan Lose No. 1 Spot In 48 hours - Sakshi
Sakshi News home page

ICC Rankings: రెండునాళ్ల ముచ్చట.. నంబర్‌ వన్‌ నుంచి మూడో స్థానానికి పడిపోయిన పాక్‌

Published Mon, May 8 2023 10:00 AM | Last Updated on Mon, May 8 2023 10:24 AM

PAK VS NZ 5th ODI: Pakistan Lose No 1 Spot In 48 hours - Sakshi

ODI Rankings: ఐసీసీ తాజాగా (మే 8) విడుదల చేసిన వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లో పాకి​స్తాన్‌ నంబర్‌ వన్‌ స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. 48 గంటల కిందటే టాప్‌ ర్యాంక్‌కు చేరిన పాక్‌కు ఆ హోదా రెండునాళ్ల ముచ్చటగానే మిగిలింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో ఓటమిపాలైన పాక్‌.. సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశంతో పాటు టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకునే గోల్డెన్‌ ఛాన్స్‌ను మిస్‌ చేసుకుంది.

పాక్‌ ఓటమితో ఆస్ట్రేలియా టాప్‌ ర్యాంక్‌కు, టీమిండియా రెండో స్థానానికి ఎగబాకాయి. టీమిండియా, ఆస్ట్రేలియాకు సమానమైన రేటింగ్‌ పాయింట్లు (113) ఉండగా.. పాక్‌కు ఒక పాయింట్‌ (112) తక్కువగా ఉంది. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ (111) నాలుగులో, న్యూజిలాండ్‌ (108), సౌతాఫ్రికా (101), బంగ్లాదేశ్‌ (95), శ్రీలంక (86), వెస్టిండీస్‌ (72), ఆఫ్ఘనిస్తాన్‌ (71) వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో నిలిచాయి. 

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో పాక్‌ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌.. విల్‌ యంగ్‌ (87), కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (59) అర్ధశతకాలతో రాణించడంతో 49.3 ఓవర్లలో 299 పరుగులు చేసి ఆలౌటైంది. చాప్‌మన్‌ (43), హెన్రీ నికోల్స్‌ (23), మెక్‌కోంచి (26), రచిన్‌ రవీంద్ర (28) పర్వాలేదనిపించారు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది 3, ఉసామా మిర్‌, షాదాబ్‌ ఖాన్‌ తలో 2 వికెట్లు, హరీస్‌ రౌఫ్‌, మహ్మద్‌ వసీం చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఛేదనలో ఇఫ్తికార్‌ అహ్మద్‌ (94 నాటౌట్‌) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినప్పటికీ పాక్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు. పాక్‌ 46.1 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఇఫ్తికార్‌కు అఘా సల్మాన్‌ (57) నుంచి కాసేపు తోడ్పాటు లభించింది. ఫకర్‌ జమాన్‌ (33) పర్వాలేదనిపించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. కివీస్‌ బౌలర్లలో హెన్రీ షిప్లే, రచిన్‌ రవీంద్ర తలో 3 వికెట్లు తీసి పాక్‌ పతనాన్ని శాశించగా.. ఆడమ్‌ మిల్నే, మ్యాట్‌ హెన్రీ, ఐష్‌ సోధి తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్‌ పాక్‌ ఆధిక్యాన్ని 1-4కు తగ్గించింది.

చదవండి: సాహో సాహా.. టెస్ట్‌ జట్టులో చోటు కన్ఫర్మ్‌.. రహానే లాగే..!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement