టిమ్‌ డేవిడ్ ఊచకోత.. ఆర్సీబీ​కి మరో గుడ్‌ న్యూస్‌ | Tim David Smashed 22 Balls Fifty In BBL, Good News For RCB | Sakshi
Sakshi News home page

టిమ్‌ డేవిడ్ ఊచకోత.. ఆర్సీబీ​కి మరో గుడ్‌ న్యూస్‌

Published Sun, Jan 5 2025 6:04 PM | Last Updated on Sun, Jan 5 2025 6:04 PM

Tim David Smashed 22 Balls Fifty In BBL, Good News For RCB

వివిధ టోర్నీలో ఇవాళ (జనవరి 5) ఇద్దరు ఆర్సీబీ ఆటగాళ్లు చెలరేగిపోయారు. బిగ్‌బాష్‌ లీగ్‌లో టిమ్‌ డేవిడ్‌ (Tim David) (హోబర్ట్‌ హరికేన్స్‌), విజయ్‌ హజారే ట్రోఫీలో రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) విధ్వంసం సృష్టించారు. అడిలైడ్‌ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్‌ డేవిడ్‌ వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న డేవిడ్‌.. ఓవరాల్‌గా 28 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. డేవిడ్‌ విధ్వంసం ధాటికి అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని హరికేన్స్‌ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌ (49), అలెక్స్‌ రాస్‌ (47) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. ఓలీ పోప్‌ (33), జేమీ ఓవర్టన్‌ (27 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. హరికేన్స్‌ బౌలర్లలో వకార్‌ సలామ్‌ఖీల్‌ 2, క్రిస్‌ జోర్డన్‌, స్టాన్‌లేక్‌, రిలే మెరిడిత్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్‌ డేవిడ్‌ అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. మిచెల్‌ ఓవెన్‌ (37), మాథ్యూ వేడ్‌ (27), నిఖిల్‌ చౌదరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో లాయిడ్‌ పోప్‌, కెమరూన్‌ బాయ్స్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ థార్న్‌టన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

శతక్కొట్టిన రజత్‌ పాటిదార్‌
విజయ్‌ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ కెప్టెన్‌, ఆర్సీబీ ఆటగాడు రజత్‌ పాటిదార్‌ సెంచరీతో కదంతొక్కాడు. బెంగాల్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో పాటిదార్‌ 137 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 132 పరుగులు (నాటౌట్‌) చేశాడు.‌ పాటిదార్‌ శతక్కొట్టడంతో ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగాల్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్‌ సుదీప్‌ ఘరామీ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. సుదీప్‌ ఛటర్జీ (47) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ ఇన్నింగ్స్‌ ఆఖర్లో బ్యాట్‌ ఝులింపించాడు. షమీ 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 42 పరుగులు చేశాడు.

అనంతరం బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ 46.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్‌ అయినప్పటికీ రజత్‌ పాటిదార్‌.. శుభమ్‌ శ్యామ్‌సుందర్‌ శర్మ (99) సాయంతో మధ్యప్రదేశ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ఇ‍ద్దరు ఆటగాళ్లు 99 పరుగుల వద్ద ఔటయ్యారు.

భీకర ఫామ్‌లో పాటిదార్‌
దేశవాలీ క్రికెట్‌లో రజత్‌ పాటిదార్‌ భీకరఫామ్‌లో ఉన్నాడు. రజత్‌ వరుసగా 76(36), 62(36), 68(40), 4(7), 36(16), 28(18), 66*(29), 82*(40), 55(33), 21*(15), 2(7), 2(3), 14(16), 132*(137) స్కోర్లు చేశాడు. రజత్‌ గత 14 ఇన్నింగ్స్‌ల్లో 6 అర్ద శతకాలు, ఓ శతకం బాదాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement