నేడు కెనడాతో భారత్ చివరి లీగ్ మ్యాచ్
జోరు మీదున్న టీమిండియా
మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు
రాత్రి 8 గంటల నుంచి నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
అమెరికా గడ్డపై అడుగు పెట్టినప్పటి నుంచి న్యూయార్క్‌లోనే ప్రాక్టీస్ మ్యాచ్, మూడు లీగ్ మ్యాచ్‌లు ఆడిన భారత బృందం ఇప్పుడు అమెరికాలోనే మరో వేదికపై తమ సత్తాను చాటేందుకు సిద్ధమైంది. వరుసగా మూడు విజయాలతో ఇప్పటికే ‘సూపర్–8’ దశకు చేరిన జట్టు అప్రధాన్య పోరులో మరో పసి కూనను ఎదుర్కోనుంది.
ఫామ్‌లో ఉన్న టీమిండియాకు కెనడా పోటీనివ్వడం కష్టమే అయినా తర్వాతి ప్రధాన మ్యాచ్‌లకు ముందు రోహిత్ బృందానికి మరో ప్రాక్టీస్ మ్యాచ్‌లాంటిదే. అయితే వర్షంతో ఆట జరుగుతుందా అనేది సందేహమే.
లాడర్‌హిల్ (ఫ్లోరిడా): అమెరికాలో గత మూడు మ్యాచ్‌లలో పరుగుల కోసం మొఖం వాచిన భారత జట్టుకు కాస్త తెరిపినిచ్చే మైదానం సిద్ధమైంది. గతంలో పరుగుల వరద పారిన బ్రోవార్డ్ కౌంటీ స్టేడియంలో నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో కెనడాతో భారత్ తలపడుతుంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయాలు సాధించిన భారత తమ స్థాయిని ప్రదర్శించగా... రెండు ఓటములతో కెనడా ఇప్పటికే ముందుకు వెళ్లే అవకాశాలు కోల్పోయింది.
కోహ్లి చెలరేగితే...
భారత జట్టుకు సంబంధించి ఈ మ్యాచ్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినా... తుది జట్టులో మార్పులు ఉంటాయా అనేది చూడాలి. ఫామ్‌పరంగా చూస్తే ఎవరినీ తప్పించే పరిస్థితి లేదు. కానీ ఒక అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం జడేజాకు బదులుగా కుల్దీప్‌ను ప్రయత్నించవచ్చు.
జడేజా గత మ్యాచ్‌లో కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. అమెరికాతో పర్వాలేదనిపించిన దూబే స్థానంలో సామ్సన్‌కు మేనేజ్‌మెంట్ అవకాశం కల్పిస్తే సూపర్ –8కు ముందు ప్రాక్టీస్ లభిస్తుంది. ప్రస్తుత స్థితిలో యశస్వి, చహల్‌లు పెవిలియన్‌కే పరిమితం కావాల్సి రావచ్చు.
అయితే అన్నింటికి మించి కోహ్లి ఫామ్‌లోకి రావాలని అంతా కోరుకుంటున్నారు. మూడు మ్యాచ్‌లలోనూ అతను సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. బౌలింగ్‌లో ముగ్గురు పేసర్లూ ఆకట్టుకున్నారు. రోహిత్, పంత్, సూర్య దూకుడైన బ్యాటింగ్‌ను నిలువరించడం కెనడాకు అంత సులువు కాదు.
సమష్టిగా రాణించాలని...
పాక్‌తో మ్యాచ్‌లో ఓడినా కెనడా గట్టి పోటీనిచ్చింది. విడిగా చూస్తే ఎవరికీ పెద్దగా పేరు లేకున్నా సమష్టి గా ఆ జట్టు వరల్డ్‌కప్‌లో తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఓపెనర్ ఆరోన్ జాన్సన్ దూకుడుగా ఆడగల సమర్థుడు. నికోలస్ కీర్తన్, మొవ్వ శ్రేయస్ కూడా ప్రధాన బ్యాటర్లు. వీరిలో ఏ ఇద్దరైనా రాణిస్తే జట్టుకు మంచి స్కోరు అందించగలరు.
కెప్టెన్, ఆల్‌రౌండర్
సాద్ బిన్ జఫర్ మరో ప్రధాన ఆటగాడు కాగా... లెఫ్టార్మ్ పేసర్ కలీమ్ ప్రభావం చూపగల బౌలర్. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఐర్లాండ్‌ను ఓడించగలిగిన కెనడా... టాప్ టీమ్‌ను ఎలా ఎదుర్కోగలదో చూడాలి.
టి20 ప్రపంచకప్‌లో నేడు
దక్షిణాఫ్రికా X నేపాల్
వేదిక: కింగ్స్‌టౌన్; ఉదయం గం. 5 నుంచి
న్యూజిలాండ్ X ఉగాండా
వేదిక: ట్రినిడాడ్; ఉదయం గం. 6 నుంచి
భారత్ X కెనడా
వేదిక: ఫ్లోరిడా; రాత్రి గం. 8 నుంచి
ఇంగ్లండ్ X నమీబియా
వేదిక: నార్త్‌సౌండ్; రాత్రి గం. 10:30 నుంచి
స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment