భారత్‌ పోరు వర్షార్పణం | India Final match against Canada cancelled | Sakshi
Sakshi News home page

భారత్‌ పోరు వర్షార్పణం

Jun 16 2024 4:13 AM | Updated on Jun 16 2024 4:13 AM

India Final match against Canada cancelled

కెనడాతోఆఖరి మ్యాచ్‌ రద్దు  

లాడర్‌హిల్‌: టి20 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్రను వరుణుడు అడ్డుకున్నాడు. గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ వర్షార్పణమైంది. శనివారం కెనడాతో జరగాల్సిన మ్యాచ్‌ రద్దయ్యింది. భారత కాలమానం ప్రకారం ముందుగా రాత్రి 7.30 గంటలకు తొలిసారి మైదానాన్ని పరిశీలించారు. మైదానం సిద్ధం కాకపోవడంతో టాస్‌ ఆలస్యమైంది. అయితే  ఆ తర్వాతా పరిస్థితి మెరుగుపడలేదు. చివరి సారిగా రాత్రి 9 గంటలకు పిచ్, అవుట్‌ ఫీల్డ్‌ను పూర్తి స్థాయిలో సమీక్షించిన ఫీల్డు అంపైర్లు ఇక ఆట జరిగే పరిస్థితి లేదని తేల్చేశారు. 

మరో సమీక్షకు తావు లేకుండా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ దక్కింది. గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి సంపూర్ణ విజయం సాధించే అవకాశం రాకపోయినా... ఇదివరకే సూపర్‌–8కు చేరిన భారత్‌ 7 పాయింట్లతో గ్రూప్‌ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. కెనడా లీగ్‌ దశలో ఐర్లాండ్‌పై ఏకైక విజయాన్ని అందుకుంది.  ఇక ఈ మెగా ఈవెంట్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన సంతృప్తికరమనే చెప్పొచ్చు. 

కోహ్లి  (1, 4, 0) మూడు మ్యాచ్‌ల్లోనూ నిరాశపరిచినా... దీన్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. సూపర్‌–8లో అతను కీలక ఇన్నింగ్స్‌లు ఆడతాడని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. కెపె్టన్‌ రోహిత్‌ ఒక అర్ధ సెంచరీ బాదగా, రిషభ్‌ పంత్‌ వన్‌డౌన్‌లో మెరుగ్గా ఆడాడు. ఐర్లాండ్, పాక్‌లతో విఫలమైన హిట్టర్లు సూర్యకుమార్‌ యాదవ్, శివమ్‌ దూబేలిద్దరు అమెరికాతో జరిగిన పోరులో టచ్‌లోకి వచ్చారు. 

ఇక బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన బుమ్రా, హార్దిక్, సిరాజ్‌లతో పాటు అర్‌‡్షదీప్‌ రాణించాడు. స్పిన్నర్లు ఫర్వాలేదనిపించారు. దీంతో విజయాల జట్టును మార్చకుండానే బరిలోకి దిగింది. సూపర్‌–8లోనూ ఇదే పంథా కొనసాగించే అవకాశాలే ఉన్నాయి. గ్రూప్‌ ‘ఎ’ నుంచి భారత్‌తో పాటు అమెరికా ముందంజ వేయగా, గత రన్నరప్‌ పాక్‌ లీగ్‌ దశతోనే సరిపెట్టుకుంది.  

టి20 ప్రపంచకప్‌లో నేడు
ఆ్రస్టేలియా X స్కాట్లాండ్‌ 
వేదిక: గ్రాస్‌ ఐలెట్‌;  ఉ.గం.6.00 నుంచి  
పాకిస్తాన్‌ X  ఐర్లాండ్‌ 
వేదిక: లాడర్‌హిల్‌; రాత్రి గం. 8 నుంచి
స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం


సూపర్‌–8లో భారత్‌ మ్యాచ్‌లు
జూన్‌ 20 –  అఫ్గానిస్తాన్‌తో (బ్రిడ్జ్‌టౌన్‌) 
జూన్‌ 22 –  బంగ్లాదేశ్‌ (లేదా) నెదర్లాండ్స్‌తో (నార్త్‌సౌండ్‌) 
జూన్‌ 24 –  ఆ్రస్టేలియాతో (గ్రాస్‌ ఐలెట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement