వారికి ఇల్లే ఆట స్థలం: ఒలింపిక్స్‌ బరిలో 24 క్రీడా కుటుంబాలు | Tokyo Olympics 24 Family Members And Twins | Sakshi
Sakshi News home page

వారికి ఇల్లే ఆట స్థలం: ఒలింపిక్స్‌ బరిలో 24 క్రీడా కుటుంబాలు

Published Tue, Jul 20 2021 9:47 AM | Last Updated on Tue, Jul 20 2021 10:16 AM

Tokyo Olympics 24 Family Members And Twins - Sakshi

తమ కుటుంబం నుంచి ఎవరైనా ఒలింపిక్స్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తే... పతకాలు సాధిస్తే ఆ ఫ్యామిలీ ఆనందం అంతా ఇంతా కాదు. నాలుగేళ్లకోసారి జరిగే విశ్వ క్రీడల్లో తోబుట్టువులు దేశం తరఫున బరిలోకి దిగడం, పతకాలు నెగ్గడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లోనూ పలు క్రీడాంశాల్లో అక్కా చెల్లెళ్లు, అన్నా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు, కవలలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. మరో మూడు రోజుల్లో మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 24 కుటుంబాల సభ్యులు ఆయా క్రీడాంశాల్లో సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. –సాక్షి క్రీడా విభాగం

గోల్డ్‌పై గోల్ఫ్‌ ‘సిస్టర్స్‌’ గురి...
అమెరికాకు చెందిన నెల్లీ, జెస్సికా కోర్డా టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల గోల్ఫ్‌ విభాగంలో పోటీ పడనున్నారు. నెల్లీ వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉండగా... జెస్సికా 13వ ర్యాంక్‌లో ఉంది. వీరికి గొప్ప క్రీడా నేపథ్యమే ఉంది. నెల్లీ, జెస్సికా తల్లిదండ్రులు పీటర్‌ కోర్డా, రెజీనా రజ్రతోవా ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ప్లేయర్లు. పీటర్‌ కోర్డా 1998 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. 1996 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో టైటిల్‌ సాధించాడు. రెజీనా 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించింది. నాలుగుగ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలోనూ పాల్గొంది. నెల్లీ, జెస్సికా సోదరుడు సెబాస్టియన్‌ కోర్డా కూడా ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌. అయితే అతను టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయాడు.

కొన్నేళ్లుగా ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌లో పలు టైటిల్స్‌ సాధించిన నెల్లీ, జెస్సికా పాల్గొంటున్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకాలతో తిరిగి వెళ్లడం ఖాయమనిపిస్తోంది. గోల్ఫ్‌లోనే కాకుండా అమెరికా నుంచి ‘సిస్టర్స్‌’ మెకంజీ–అరియా (వాటర్‌ పోలో), క్రిస్టీ–సామ్‌ మెవిస్‌ (మహిళల ఫుట్‌బాల్‌), కెల్లీ–కోట్నీ హర్లీ (ఫెన్సింగ్‌)... ‘బ్రదర్స్‌’ కవిక–ఎరిక్‌ షోజీ (వాలీబాల్‌), హెన్రీ–జాక్సన్‌ లెవెరెట్‌ (షూటింగ్‌) టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. ఇందులో కెల్లీ–కోట్నీ, కవిక–ఎరిక్‌ జోడీలు గతంలో ఒలింపిక్స్‌లో పతకాలు కూడా సాధించాయి.

హర్డిల్స్‌లో అక్కాచెల్లెళ్లు...
బ్రిటన్‌కు చెందిన అథ్లెటిక్స్‌ ‘సిస్టర్స్‌’ టిఫానీ పోర్టర్‌–సిండీ సెంబర్‌ వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సెంబర్‌ నాలుగో స్థానంలో, టిఫానీ ఏడో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది టిఫానీ 12.51 సెకన్ల అత్యుత్తమ సమయాన్ని నమోదు చేయగా... సిండీ 12.53 సెకన్లతో సోదరికి సమీపంలో ఉంది. ఇక బ్రిటన్‌ నుంచే ‘సిస్టర్స్‌’ జెన్నిఫర్‌–జెస్సికా (జిమ్నాస్టిక్స్‌), జోడీ–హానా విలియమ్స్‌ (అథ్లెటిక్స్‌), మథిల్డా–చార్లోటి హాడ్జ్‌కిన్స్‌ (రోయింగ్‌), ‘బ్రదర్స్‌’ మాక్స్‌–జో లిచ్‌ఫీల్డ్‌ (స్విమ్మింగ్‌–బ్రిటన్‌), ‘ట్విన్‌ బ్రదర్స్‌’ ఆడమ్‌–సిమోన్‌ యేట్స్‌ (సైక్లింగ్‌), ప్యాట్‌–ల్యూక్‌ మెకార్మక్‌ (బాక్సింగ్‌–బ్రిటన్‌),  అన్నా, చెల్లెలు హ్యారీ–హనా మార్టిన్‌ (హాకీ), ఎమిలీ–టామ్‌ ఫోర్డ్‌ (రోయింగ్‌) బరిలో ఉన్నారు.

బాస్కెట్‌బాల్‌ బ్రదర్స్‌...
అమెరికా, బ్రిటన్‌ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా క్రీడా కుటుంబాలు టోక్యోకు వస్తున్నాయి. పురుషుల బాస్కెట్‌బాల్‌లో స్పెయిన్‌కు చెందిన సోదర ద్వయం పావ్, మార్క్‌ గసోల్‌ నాలుగోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటోంది. పావ్, మార్క్‌ సభ్యులుగా ఉన్న స్పెయిన్‌ జట్టు 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజత పతకాలు సాధించగా... 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ‘స్విమ్మింగ్‌ సిస్టర్స్‌’ కేట్‌ క్యాంప్‌బెల్, బోంటి క్యాంప్‌బెల్‌ మరోసారి స్వర్ణమే లక్ష్యంగా పోటీపడనున్నారు. కేట్‌కిది నాలుగో ఒలింపిక్స్‌కాగా... ఆమె సోదరి బోంటికి రెండో ఒలింపిక్స్‌.

2016 రియో ఒలింపిక్స్‌లో కేట్, బోంటిలతో కూడిన ఆస్ట్రేలియా జట్టు 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రిలేలో స్వర్ణ పతకం సాధించింది. వీరే కాకుండా ఆఫ్రికాలోని కేప్‌ఫ వెర్డె దేశం నుంచి స్విమ్మింగ్‌లో అన్నా, చెల్లెళ్లు లాట్రోయ, ట్రాయ్, జేలా పినా... స్విమ్మింగ్‌లో ‘సిస్టర్స్‌’ బోంటి, కేట్‌ క్యాంప్‌బెల్‌ (ఆస్ట్రేలియా), సింక్రనైజ్డ్‌ స్విమ్మింగ్‌లో అన్నా మరియా, ఎరిని అలెగ్జాండ్రి (ఆస్ట్రియా)... లౌరా–చార్లోటి ట్రెంబల్‌ (ఫ్రాన్స్‌)... సెయిలింగ్‌లో ‘బ్రదర్స్‌’ సిమ్‌–మిహోవిల్‌ ఫెంటెలా (క్రొయేషియా)... ఎటెస్‌–డెనిజ్‌ సినార్‌ (టర్కీ), జిమ్నాస్టిక్స్‌లో ‘ట్విన్‌ సిస్టర్స్‌’ సేన్‌–లీకీ వెవెర్స్‌ (నెదర్లాండ్స్‌), ట్రయాథ్లాన్‌లో అన్నా, చెల్లెలు ట్రెంట్‌ థోర్ప్, ఐన్స్‌లే (న్యూజిలాండ్‌) కూడా బరిలోనిలిచారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement