
టోక్యో: ఒలింపిక్ క్రీడా గ్రామంలో కరోనా కలకలం... ఆటగాళ్లు గేమ్స్ విలేజ్‌లోకి వచ్చిన తర్వాత తొలిసారి కోవిడ్ కేసులు బయట పడ్డాయి. దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఆదివారం ‘పాజిటివ్’గా తేలారు. థబిసో మొన్యానే, కమొహెలో మహలత్సి అనే ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకినట్లు దక్షిణాఫ్రికా ఒలింపిక్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. క్రీడా గ్రామం బయట ఉంటున్న ఇదే జట్టు
వీడియో ఎనలిస్ట్ మారియో మాషా కూడా పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. వీరందరినీ ఐసోలేషన్‌కు పంపించడంతో పాటు తదుపరి పరీక్షల వరకు జట్టు ఇతర సభ్యులు కూడా ప్రాక్టీస్‌కు దిగరాదని నిర్వాహకులు ఆదేశించారు. మరోవైపు ఒలింపిక్స్‌లో ఫేవరెట్ అయిన దక్షిణాఫ్రికా రగ్బీ టీమ్ కోచ్ నీల్ పావెల్‌కు కూడా కరోనా సోకింది. ఈయన కూడా గేమ్స్ విలేజ్‌లోనే ఉంటున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న జట్లలో భాగమై కోవిడ్ సోకిన నలుగురూ దక్షిణాఫ్రికాకు చెందినవారే కాగా... నిర్వహణా ఏర్పాట్ల బృందంలోని మరో ఆరుగురితో కలిపి ఆదివారం మొత్తం 10 కేసులు బయటపడ్డాయి.ఓవరాల్‌గా ఒలింపిక్స్ తో సంబంధం ఉన్న పాజిటివ్‌ల సంఖ్య 55కు చేరింది. గేమ్స్ విలేజ్‌లో భారత బృందం ఉన్న టవర్ 15లోనే దక్షిణాఫ్రికా టీమ్ ఉంటోంది.