
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల కోసం అమెరికాకు వెళ్లనుంది. మణిపూర్‌కు చెందిన 26 ఏళ్ల మీరాబాయి నెలన్నర రోజులపాటు అమెరికాలో శిక్షణ తీసుకోనుంది. ఈ మేరకు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) ఆధ్వర్యంలోని మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) రూ. 70 లక్షల 80 వేలు మంజూరు చేసింది. హెడ్ కోచ్ విజయ్ శర్మ, మరో ఇద్దరు సహాయక సిబ్బందితో కలిసి మీరాబాయి శనివారం అమెరికాకు బయలుదేరనుంది.
వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ
న్యూఢిల్లీ: కరోనా ఉధృతి కారణంగా భారత్ నుంచి విమానాల రాకపోకలపై పలు యూరప్ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ... వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు భారత రెజ్లర్లు బల్గేరియా రాజధాని సోఫియాకు శనివారం చేరుకున్నారు. వాస్తవానికి నెదర్లాండ్స్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ ద్వారా రెజ్లర్లు బుధవారమే అమ్‌స్టర్‌డామ్ చేరుకొని అక్కడి నుంచి సోఫియాకు వెళ్లాలి. అయితే భారత విమానాలపై నెదర్లాండ్స్ ప్రభుత్వం నిషేధం విధించడంతో భారత రెజ్లర్ల టికెట్లను ఈ ఎయిర్‌లైన్స్ రద్దు చేసింది. దాంతో భారత రెజ్లర్లు ఈ విమానం ఎక్కలేకపోయారు. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) వెంటనే ఎయిర్‌ఫ్రాన్స్ ద్వారా రెజ్లర్లకు టికెట్లు బుక్ చేసింది.
దాంతో 10 మంది సభ్యులుగల భారత బృందం పారిస్ చేరుకొని అక్కడి నుంచి సోఫియాకు వెళ్లింది. మే 6 నుంచి 9 వరకు జరిగే ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన రెజ్లర్లకు టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారవుతుంది. భారత్ తరఫున పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో అమిత్ ధన్‌కర్ (74 కేజీలు), సత్యవర్త్ (97 కేజీలు), సుమిత్ (125 కేజీలు)... గ్రీకో రోమన్ విభాగంలో సచిన్ రాణా (60 కేజీలు), ఆశు (67 కేజీలు), గుర్‌ప్రీత్‌సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు), దీపాంశు (97 కేజీలు), నవీన్ (130 కేజీలు)... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సీమా (50 కేజీలు), నిషా (68 కేజీలు), పూజా సిహాగ్ (76 కేజీలు) బరిలో ఉన్నారు.