లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్‌కరాజ్ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఈ స్పెయిన్ స్టార్ 6–4, 7–6 (7/2), 6–3తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 2 గంటల 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్ ఐదు ఏస్‌లు సంధించాడు.
32 విన్నర్స్ కొట్టి, 41 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 29 సార్లు దూసుకొచ్చి 24 సార్లు పాయింట్లు గెలిచాడు. రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్‌కరాజ్ తన సర్విస్‌లో మాత్రం ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. మరోవైపు ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) హోరాహోరీ పోరులో గట్టెక్కి మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు.
2013, 2016 వింబుల్డన్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో 4 గంటల 40 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ పోరులో సిట్సిపాస్ 7–6 (7/3), 6–7 (2/7), 4–6, 7–6 (7/3), 6–4తో విజయం సాధించాడు. 17 ఏస్‌లు సంధించిన సిట్సిపాస్ ఏకంగా 90 విన్నర్స్ కొట్టడం విశేషం. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 6–3, 7–6 (7/5)తో మనారినో (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) 6–3, 7–6 (7/3), 6–4తో కార్బాలెస్ బేనా (స్పెయిన్)పై నెగ్గారు.
అజరెంకా జోరు
మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్), నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో అజరెంకా 6–2, 6–4తో 11వ సీడ్ కసత్‌కినా (రష్యా)ను ఓడించగా... పెగూలా 6–4, 6–0తో కొకియారెటో (ఇటలీ)పై గెలిచింది.
సుదీర్ఘ టైబ్రేక్...
మహిళల సింగిల్స్‌లో సురెంకో (ఉక్రెయిన్), అనా బొగ్డాన్ (రొమేనియా) మ్యాచ్ చరిత్రకెక్కింది. 3 గంటల 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సురెంకో 4–6, 6–3, 7–6 (20/18)తో బొగ్డాన్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. నిర్ణాయక మూడో సెట్‌లో టైబ్రేక్ ఏకంగా 37 నిమిషాలు సాగింది.
తద్వారా మహిళల గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో సుదీర్ఘంగా సాగిన టైబ్రేక్‌గా రికార్డు నమోదైంది. 38 పాయింట్ల తర్వాత టైబ్రేక్‌లో ఫలితం తేలడం కూడా రికార్డే. ఈ మ్యాచ్‌లో సురెంకో ఐదుసార్లు, బొగ్డాన్ ఆరుసార్లు మ్యాచ్ పాయింట్లు కాపాడుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment