క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. వివిధ ఫార్మాట్లలో ఇవాళ (2024, ఫిబ్రవరి 2న) ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ముందుగా విశాఖ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌తో భారత ఆటగాడు రజత్ పాటిదార్, ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశారు.
వెస్టిండీస్‌తో ఇవాళ జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు వన్డే అరంగేట్రం చేశారు. శ్రీలంకతో ఇవాళే మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేశారు. మొత్తంగా ఇవాళ ఎనిమిది మంది ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. క్రికెట్ చరిత్రలో ఇంతమంది ఒకే రోజు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి.
ఇవాళ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాళ్ల వివరాలు..
- రజత్ పాటిదార్ (భారత్)
- షోయబ్ బషీర్ (ఇంగ్లండ్)
- జేవియర్ బార్ట్‌లెట్ (ఆస్ట్రేలియా)
- లాన్స్ మోరిస్ (ఆస్ట్రేలియా)
- నూర్ అలీ జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్)
- నవీద్ జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్)
- జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ (ఆఫ్ఘనిస్తాన్)
- మొహమ్మద్ సలీం (ఆఫ్ఘనిస్తాన్)
ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో ఇవాళ మొదలైన రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (125 నాటౌట్) కెరీర్‌లో మూడో సెంచరీతో కదంతొక్కగా.. అతనికి జతగా అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ (25) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం ఆటగాళ్లు రజత్ పాటిదార్, షోయబ్ బషీర్ పర్వాలేదనిపించారు.
ఆస్ట్రేలియా-వెస్టిండీస్ తొలి వన్డే విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయానికి చేరువలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 48.4 ఓవరల్లో 231 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 34 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 208 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. గ్రీన్ (68), స్టీవ్ స్మిత్ (65) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ గెలుపుకు మరో 24 పరుగులు మాత్రమే అవసరం ఉంది. అరంగేట్రం ఆటగాళ్లు జేవియర్ బార్ట్‌లెట్ (9-1-17-4) అద్భుత గణాంకాలతో విజృంభించగా.. లాన్స్ మోరిస్ (10-2-59-0) పర్వాలేదనిపించాడు.
ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ తొలి రోజు మూడో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు (53 ఓవర్లు) చేసింది. కైస్ అహ్మద్ (16), జియా ఉర్ రెహ్మాన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. అరంగేట్రం ఆటగాళ్లలో నూర జద్రాన్ (31) కాస్త పర్వాలేదనించాడు.
Comments
Please login to add a commentAdd a comment