ఆండర్సన్‌ టెస్ట్‌ల్లో ఎంట్రీ ఇచ్చేనాటికి "ఆ ఇద్దరు" పుట్టనేలేదు..! | IND VS ENG 2nd Test: Shoaib Bashir And Rehan Ahmed Were Not Even Born When Jimmy Anderson Made His Test Debut | Sakshi
Sakshi News home page

ఆండర్సన్‌ టెస్ట్‌ల్లో ఎంట్రీ ఇచ్చేనాటికి "ఆ ఇద్దరు" పుట్టనేలేదు..!

Published Thu, Feb 1 2024 5:04 PM | Last Updated on Thu, Feb 1 2024 5:24 PM

IND VS ENG 2nd Test: Shoaib Bashir And Rehan Ahmed Were Not Even Born When Jimmy Anderson Made His Test Debut - Sakshi

విశాఖ వేదికగా భారత్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టును ఇదివరకే ప్రకటించారు. 41 ఏళ్ల ఇంగ్లండ్‌ వెటరన్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ రేపటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. జట్టు కూర్పు కారణంగా తొలి టెస్ట్‌ ఆడే అవకాశం దక్కని ఆండర్సన్‌ను రెండో టెస్ట్‌లో బరిలోకి దించాలని ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది.

ఆండర్సన్‌ ఎంట్రీతో తొలి టెస్ట్‌ ఆడిన మరో పేసర్‌ మార్క్‌ వుడ్‌పై వేటు పడింది. టీమిండియాపై, ప్రత్యేకించి భారత గడ్డపై ఘనమైన ట్రాక్‌ రికార్డు కలిగిన ఆండర్సన్‌ రేపటి మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఈ మార్పుతో పాటు రెండో టెస్ట్‌ కోసం​ ప్రకటించిన ఇంగ్లండ్‌ తుది జట్టులో మరో మార్పు కూడా చోటు చేసుకుంది. తొలి టెస్ట్‌లో ఆడిన సీనియర్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ గాయపడటంతో అతని స్థానంలో పాక్‌ మూలాలున్న స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌కు ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌ అవకాశం కల్పించింది. ఈ రెండు మార్పులతో ఇంగ్లండ్‌ రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొంటుంది. 

ఇదిలా ఉంటే, వెటరన్‌ పేసర్‌ ఆండర్సన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఆండర్సన్‌ టెస్ట్‌ అరంగేట్రం చేసే నాటికి అతని ప్రస్తుత సహచరుల్లో ఇద్దరు పుట్టనే లేదు. ఆండర్సన్‌ 2003, మే 22న తన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ (జింబాబ్వేపై) ఆడగా.. ప్రస్తుత ఇంగ్లండ్‌ జట్టు సభ్యులు షోయబ్‌ బషీర్‌, రెహాన్‌ అహ్మద్‌ అప్పటికి జన్మించలేదు.

బషీర్‌ 2003, అక్టోబర్‌ 13న పుట్టగా.. రెహాన్‌ 2004, ఆగస్ట్‌ 13న జన్మించాడు. ఈ ఆసక్తికర అంశం గురించి తెలిసి ఆండర్సన్‌ ఫిట్‌నెస్‌ను, ఆట పట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని అందరూ కొనియాడుతున్నారు. ఆండర్సన్‌ ప్రస్తుత పరిస్థితి చూస్తే, అతను మరో రెండేళ్లు కూడా ఆడేలా ఉన్నాడంటు కామెంట్లు చేస్తున్నారు. రేపటి మ్యాచ్‌లో ఆండర్సన్‌.. షోయబ్‌, రెహాన్‌లతో కలిసి బరిలోకి దిగనున్నాడు.

ఇదిలా ఉంటే, ఆండర్సన్‌ ప్రస్తుతం టెస్ట్‌ క్రికెట్‌లో మూడో అత్యధిక వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అతను 183 టెస్ట్‌లు ఆడి 690 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత లంక దిగ్గజం ముత్తయ్య మురళీథరన్‌కు (800 వికెట్లు) దక్కింది. అతనికి తర్వాతి స్థానంలో షేన్‌ వార్న్‌ (708) ఉన్నాడు. వీరిద్దరి తర్వాతి స్థానాన్ని ఆండర్సన్‌ ఆక్రమించాడు. 

టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్‌ తుదిజట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement