
వైజాగ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బరిలోకి దిగడం ద్వారా ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ చరిత్ర సృష్టించాడు. భారత గడ్డపై అత్యధిక వయసులో ( 41 ఏళ్ల 187 రోజులు) టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఆండర్సన్‌కు ముందు లాలా అమర్‌నాథ్ (1952లో 41 ఏళ్ల 92 రోజుల వయసులో భారత గడ్డపై పాక్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాడు) భారత్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడిన అత్యధిక వయస్కుడిగా ఉన్నాడు. ఈ జాబితాలో రే లిండ్‌వాల్ (38 ఏళ్ల 112 రోజులు), షూటే బెనర్జీ (37 ఏళ్ల 124 రోజులు), గులామ్ గార్డ్ (34 ఏళ్ల 20 రోజులు) మూడు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు.
History created by Anderson. 🐐
— Johns. (@CricCrazyJohns) February 2, 2024
- He is the oldest pacer to play Tests in India. pic.twitter.com/VcxhpfmUBO
ఇదిలా ఉంటే, లేటు వయసులోనూ ఏమాత్రం దూకుడు తగ్గని ఆండర్సన్ టీమిండియాపై సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ వెటరన్ పేసర్ టెస్ట్ క్రికెట్‌లో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆండర్సన్ ఖాతాలో 691 వికెట్లు ఉన్నాయి. ప్రస్తుత టెస్ట్ మ్యాచ్‌లో ఆండర్సన్ కీలకమైన శుభ్‌మన్ గిల్ వికెట్ పడగొట్టాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ తొలి రోజు టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (125 నాటౌట్) కెరీర్‌లో మూడో సెంచరీతో కదంతొక్కగా.. అతనికి జతగా అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ (25) క్రీజ్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ (14), శుభ్‌మన్ గిల్ (34), శ్రేయస్ అయ్యర్ (27) మరోసారి నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌లో ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.
ఆండర్సన్ ఖాతాలో మరో రికార్డు..
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ ఆండర్సన్ ఖాతాలో మరో రికార్డు చేరింది. అత్యధిక క్యాలెండర్ ఇయర్స్‌లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో శివ్‌నరైన్ చంద్రపాల్‌తో కలిసి ఆండర్సన్ రెండో స్థానంలో నిలిచాడు. చంద్రపాల్, ఆండర్సన్ ఇద్దరూ 22 క్యాలెండర్ ఇయర్స్‌లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 25 క్యాలెండర్ ఇయర్స్‌లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.