అదేం బ్యాటింగ్‌ సామీ!.. ఊచకోతే.. రోహిత్‌ రికార్డు బద్దలు | Travis Head Breaks Unluckiest Rohit Sharma All Time ODI Record | Sakshi
Sakshi News home page

హెడ్‌ ఊచకోత.. పరుగుల విధ్వంసం.. రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు

Published Fri, Sep 20 2024 2:43 PM | Last Updated on Fri, Sep 20 2024 3:48 PM

Travis Head Breaks Unluckiest Rohit Sharma All Time ODI Record

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌. విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తనకు తానే సాటి అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్లో పవర్‌ ప్లేలో అత్యధిక స్ట్రయిక్‌రేటుతో అత్యధిక పరుగులు రాబట్టిన క్రికెటర్‌గా కొనసాగుతున్న హెడ్‌.. వన్డేల్లోనూ హవా కొనసాగిస్తున్నాడు.

ఆరోజు టీమిండియాపై
టీమిండియాతో వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ సృష్టించిన పరుగుల సునామీని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. నీలిసంద్రమైన అహ్మదాబాద్‌ స్టేడియంలో.. అశేష టీమిండియా అభిమానుల నడుమ.. 137 పరుగులతో హెడ్‌ చెలరేగాడు. 

బౌండరీల వర్షం కురిపిస్తూ చేతికే బ్యాట్‌ మొలిచిందా అన్నట్లు పరుగుల వరద పారించాడు.  120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అద్భుత శతకం సాధించి.. రోహిత్‌ సేనకు పీడకలను మిగిల్చాడు. తాజాగా.. ట్రవిస్‌ హెడ్‌ మరోసారి అదే తరహా సునామీ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. 

అతడి పరుగుల దాహానికి ఇంగ్లండ్‌ బౌలర్లు బలి
ఈసారి అతడి పరుగుల దాహానికి ఇంగ్లండ్‌ బౌలర్లు బలయ్యారు. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా గురువారం జరిగిన వన్డేలో హెడ్‌ పరుగుల సునామీ సృష్టించాడు. 129 బంతులు ఎదుర్కొన్న అతడు ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ.. ఏకంగా 20 ఫోర్లు, 5 సిక్స్‌లు బాదాడు.

రికార్డులు సాధించిన హెడ్‌
మొత్తంగా 154 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను ట్రవిస్‌ హెడ్‌ తన ఖాతాలో జమచేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. అంతకు ముందు షేన్‌ వాట్సన్‌ 2011లో 161 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇక ఆస్ట్రేలియా తరఫున వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు(20) బాదిన మూడో క్రికెటర్‌గానూ హెడ్‌ మరో రికార్డు సాధించాడు. ఈ జాబితాలో డేవిడ్‌ వార్నర్‌(24), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(21) హెడ్‌ కంటే ముందున్నారు. అయితే, ఈ రెండు ఘనతలతో పాటు మరో అరుదైన ఫీట్‌ను కూడా ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ అందుకున్నాడు.  

రోహిత్‌ శర్మ పేరిట ఉన్న రికార్డు బద్దలు
ట్రెంట్‌బ్రిడ్జి స్టేడియంలో వన్డే లక్ష్య ఛేదనలో విజయవంతమైన జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా హెడ్‌ చరిత్రకెక్కాడు. తద్వారా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. 2018లో రోహిత్‌ ఇదే స్టేడియంలో 114 బంతుల్లో 137 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్‌ శర్మ సృష్టించిన ఓ అరుదైన రికార్డును హెడ్‌ బ్రేక్‌ చేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌-2023 సందర్భంగా.. న్యూజిలాండ్‌పై హెడ్‌ 59 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన తొలి ఓపెనర్‌గా హెడ్‌ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు రోహిత్‌ పేరిట ఉండేది.

ఇదే ఎడిషన్‌లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ 63 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు. ఇలా రోహిత్‌ సాధించిన రెండు అరుదైన రికార్డులను బద్దలు కొట్టాడు హెడ్‌. 

అత్యంత దురదృష్టవంతుడైన వ్యక్తి
ఇక వరల్డ్‌కప్‌ ఫైనల్లో టీమిండియాపై ఆసీస్ విజయం తర్వాత హెడ్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడైన వ్యక్తి బహుశా రోహితే అయ్యుంటాడని పేర్కొన్న విషయం తెలిసిందే. అద్భుత ఫామ్‌లో ఉన్నా జట్టుకు ట్రోఫీ అందించలేకపోయాడనే ఉద్దేశంతో హెడ్‌ అలా వ్యాఖ్యానించాడు.

చదవండి: Eng Vs Aus: లబుషేన్‌ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement