పరుగు తేడాతో యూపీ అనూహ్య విజయం
మహిళల ప్రీమియర్ లీగ్
న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఉర్రూతలూగించిన మ్యాచ్ జరిగింది. గెలుపు దిశగా పయనిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను దీప్తిశర్మ (4/19) అద్భుత బౌలింగ్‌తో ఓడించింది. ఢిల్లీ లక్ష్యం 138 పరుగులు కాగా... ఒక దశలో 18 ఓవర్లలో 124/4 స్కోరు వద్ద విజయానికి 12 బంతుల్లో 15 పరుగుల దూరంలో ఉంది. అయితే 11 బంతుల్లో 6 వికెట్లను కోల్పోయిన ఢిల్లీ గెలుపు వాకిట బొక్కబోర్లా పడింది.
యూపీ వారియర్స్ ఆఖరి దాకా పోరాడి పరుగు తేడాతో గెలిచింది. 19వ ఓవర్ వేసిన దీప్తి 3 వికెట్లు తీసి 5 పరుగులే ఇవ్వడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆమె శ్రమను నీరుగార్చకుండా చివరి ఓవర్లో బౌలింగ్‌కు దిగిన గ్రేస్ హారిస్ (2/8) ఐదు బంతులేసి రెండు వికెట్లు తీసింది. దీంతో పాటు మరో రనౌట్ కూడా చేసిన యూపీ విజయాన్నందుకుంది. ఉత్కంఠ రేపిన ఈ పోరు అందర్ని మునివేళ్లపై నిలబెట్టింది. మొదట యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. దీప్తిశర్మ (48 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో మళ్లీ ఒంటరి పోరాటం చేసింది.
క్యాపిటల్స్ బౌలర్లు రాధా యాదవ్, టైటస్ సాధు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 137 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్, కెపె్టన్ మెగ్ లానింగ్ (46 బంతుల్లో 60; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, తర్వాత వచ్చిన వారు చెత్తషాట్లతో ఓటమిని మూల్యంగా చెల్లించారు. జెమీమా (17), షఫాలీ (15), అలైస్ క్యాప్సీ (15) రెండంకెల స్కోర్లు చేశారంతే! ఎవరూ క్రీజులో నిలిచే ప్రయత్నం చేయలేదు. నేడు జరిగే మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment