Venkatesh Prasad Slams Team India's Approach And Attitude Towards The Game - Sakshi
Sakshi News home page

విండీస్‌ చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాను ఏకి పారేసిన భారత మాజీ.. డబ్బు, అధికారం..!

Published Sun, Jul 30 2023 7:55 PM | Last Updated on Mon, Jul 31 2023 9:18 AM

Venkatesh Prasad Slams Team India For Their Approach And Attitude Towards The Game - Sakshi

విండీస్‌తో రెండో వన్డేలో ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకున్న టీమిండియాపై ముప్పేట దాడి జరుగుతుంది. అభిమానులు, మాజీలు భారత ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. రోహిత్‌, కోహ్లిలను రెస్ట్‌ ఇచ్చి టీమిండియా మేనేజ్‌మెంట్‌ పెద్ద తప్పిదమే చేసిందని మండిపడుతున్నారు. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చెత్త వ్యూహాల వల్ల వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేని జట్టు చేతిలో టీమిండియా ఓటమిపాలైందని ధ్వజమెత్తుతున్నారు. 

డ‌బ్బు, గ‌ర్వం వ‌ల్ల భార‌త క్రికెట‌ర్లు ఆట‌పై దృష్టి పెట్ట‌డం లేద‌ని 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నింగ్‌ కెప్టెన్ క‌పిల్ దేవ్ విమర్శిస్తే.. తాజాగా మరో భారత మాజీ (వెంకటేశ్‌ ప్రసాద్‌) టీమిండియాను తూర్పారబెట్టాడు. రెండో వన్డేలో విండీస్‌ చేతిలో ఓడిన భారత జట్టుపై అతను విరుచుకుపడ్డాడు.

టెస్ట్ క్రికెట్‌ను పక్కన పెడితే, గత కొంతకాలంగా టీమిండియా మిగతా రెండు ఫార్మాట్లలో అతి సాధారణమైన జట్టుగా తయారైందని.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, చివరకు బంగ్లాదేశ్‌ చేతిలో కూడా సిరీస్‌లు కోల్పోయిందని దుయ్యబట్టాడు. గత రెండు టీ20 వరల్డ్‌కప్‌లలో టీమిండియా ప్రదర్శన పేలవంగా ఉందని, మనకంటే చిన్న జట్లు చాలా మెరుగైన ప్రదర్శనలు చేసాయని గుర్తు చేశాడు. 

టీమిండియా పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉందని.. డబ్బు, అధికారం ఉండటంతో భారత జట్టు సాధార‌ణ విజ‌యాల‌కే పొంగిపోతుందని, ఛాంపియ‌న్ జ‌ట్టుకు కావాల్సిన లక్షణాలు టీమిండియాలో అస్సలు కనిపించడం లేదని ‌విమర్శ‌లు గుప్పించాడు.

టీమిండియాలో ప్రస్తుత ఇంగ్లండ్‌ జట్టులోని దూకుడు కానీ, 90ల్లో ఆస్ట్రేలియా జట్టులోని భీకరత్వం కానీ లేవని అన్డాను. గతకొంతకాలంగా భారత పరిమిత ఓవర్ల జట్టు అతి సాధారణ జట్టులా ఉంటుందని ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ప్రతి జట్టు గెలవడానికే ఆడుతుందని, టీమిండియా కూడా అదే లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నప్పటికీ.. ఆట విషయంలో వారి వైఖరి గత కొంత కాలంగా ఏమీ బాగోలేదని, ఇదే భారత జట్టు పేలవ ప్రదర్శనకు ప్రధాన కారణమని ట్వీట్‌లో జోడించాడు.

ఇదిలా ఉంటే, విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను విండీస్‌ 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. విండీస్‌ బౌలర్ల ధాటికి 40.5 ఓర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (55), శుభ్‌మన్‌ గిల్‌(34) మాత్రమే రాణించారు. విండీస్‌ బౌలర్లలో రొమారియో షెఫర్డ్‌, గుడకేశ్‌ మోటీ తలో 3 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌.. 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ హోప్‌ (63 నాటౌట్‌), కార్టీ (48 నాటౌట్‌) రాణించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement