అజరెంకా అదరహో  | Victoria Azarenka to the semifinals of a Grand Slam tournament | Sakshi
Sakshi News home page

అజరెంకా అదరహో 

Published Fri, Sep 11 2020 2:29 AM | Last Updated on Fri, Sep 11 2020 5:21 AM

Victoria Azarenka to the semifinals of a Grand Slam tournament - Sakshi

న్యూయార్క్‌: ఏడేళ్ల విరామం తర్వాత ప్రపంచ మహిళల టెన్నిస్‌ వరల్డ్‌ మాజీ నంబర్‌వన్‌ విక్టోరియా అజరెంకా ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో ఈ బెలారస్‌ ‘మమ్మీ’ క్వార్టర్‌ ఫైనల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. 16వ సీడ్‌ ఎలీసె మెర్‌టెన్స్‌ (బెల్జియం)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్‌ అజరెంకా కేవలం ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయి తన ప్రత్యర్థిని 6–1, 6–0తో చిత్తుగా ఓడించింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మెర్‌టెన్స్‌ తన సర్వీస్‌ను ఒక్కసారీ నిలబెట్టుకోలేకపోయింది. ఆమె సాధించిన ఒక్క గేమ్‌ కూడా తొలి సెట్‌లో అజరెంకా సర్వీస్‌ను బ్రేక్‌ చేయడం ద్వారానే రావడం గమనార్హం. మ్యాచ్‌ మొత్తంలో అజరెంకా మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. నెట్‌ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు సాధించింది. కేవలం 11 అనవసర తప్పిదాలు చేసిన ఆమె 21 విన్నర్స్‌ కొట్టింది.  

పునరాగమనం... 
2016 డిసెంబరులో మగ బిడ్డకు జన్మనిచ్చిన అజరెంకా ఏడు నెలలపాటు ఆటకు విరామం ఇచ్చింది. 2017 జూలైలో వింబుల్డన్‌ టోర్నీ ద్వారా గ్రాండ్‌స్లామ్‌లలో పునరాగమనం చేసింది. ఆ తర్వాత ఆమె మరో ఏడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో పాల్గొన్నా మూడో రౌండ్‌ను దాటలేకపోయింది.   

సెరెనాను దాటితేనే.... 
2012, 2013లలో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరుకొని రెండుసార్లూ సెరెనా చేతిలో ఓడి రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్న అజరెంకా... ఈసారి ట్రోఫీని ముద్దాడాలంటే... ముందుగా శుక్రవారం జరిగే సెమీఫైనల్లో 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ విజేత, ఆరుసార్లు యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్, తన చిరకాల ప్రత్యర్థి సెరెనా విలియమ్స్‌ (అమెరికా) అడ్డంకిని దాటాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అజరెంకా, సెరెనా మధ్య 22 సార్లు ముఖాముఖి పోరు జరిగింది. 18 సార్లు సెరెనా... నాలుగుసార్లు అజరెంకా విజయం సాధించారు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో వీరిద్దరు 10 సార్లు తలపడగా... పదికి పది మ్యాచ్‌ల్లో సెరెనానే గెలుపొందడం విశేషం. ఈసారి యూఎస్‌ ఓపెన్‌లో సెరెనా మూడో రౌండ్, ప్రిక్వార్టర్‌ ఫైనల్, క్వార్టర్‌ ఫైనల్లో మూడు సెట్‌లలో తన ప్రత్యర్థులను ఓడించి తనకు 38 ఏళ్లు వచ్చినా తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తోంది.  

థీమ్‌ తొలిసారి... 
పురుషుల సింగిల్స్‌లో టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకడైన రెండో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ యూఎస్‌ ఓపెన్‌లో తొలిసారి సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ థీమ్‌ 6–1, 6–2, 6–4తో 21వ సీడ్‌ అలెక్స్‌ డి మినార్‌ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచాడు. తద్వారా యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలో సెమీఫైనల్‌ దశకు చేరిన తొలి ఆస్ట్రియా ఆటగాడిగా థీమ్‌ గుర్తింపు పొందాడు. ఫైనల్లో స్థానం కోసం మూడో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)తో థీమ్‌ తలపడతాడు. ముఖాముఖి పోరులో థీమ్‌ 2–1తో ఆధిక్యంలో ఉన్నాడు. థీమ్‌ తన కెరీర్‌లో మూడుసార్లు (2018, 2019–ఫ్రెంచ్‌ ఓపెన్‌; 2020 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో ఫైనల్‌ చేరి మూడుసార్లూ ఓడి రన్నరప్‌గా నిలిచాడు. మెద్వెదేవ్‌ తన కెరీర్‌లో ఒకసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో (2019 యూఎస్‌ ఓపెన్‌) ఫైనల్‌ చేరి ఓడిపోయాడు.  

మెద్వెదేవ్‌... అదే జోరు... 
మరో క్వార్టర్‌ ఫైనల్లో మెద్వెదేవ్‌ 7–6 (8/6), 6–3, 7–6 (7/5)తో తన దేశానికే చెందిన పదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా)ను ఓడించాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 82 కేజీల బరువున్న మెద్వెదేవ్‌ ఈ మ్యాచ్‌లో 16 ఏస్‌లు సంధించాడు. 2 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో మెద్వెదేవ్‌ రెండో సెట్‌లో ఒకసారి రుబ్లెవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. తన సర్వీస్‌లో ఒక్కసారీ తన ప్రత్యర్థికి బ్రేక్‌ పాయింట్‌ అవకాశం ఇవ్వలేదు. సెమీఫైనల్‌ చేరే క్రమంలో మెద్వెదేవ్‌ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా ఇవ్వకపోవడం విశేషం. మరో సెమీఫైనల్లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), కరెనో బుస్టా (స్పెయిన్‌) తలపడతారు. ముఖాముఖి పోరులో జ్వెరెవ్‌ 1–0తో ఆధిక్యంలో ఉన్నాడు. వీరిలో ఎవరు గెలిచినా తమ కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరుతారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement