pic credit: IPL Twitter
నరాలు తెగే ఉత్కంఠ నడుమ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న (ఏప్రిల్ 11) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో చివరి బంతికి గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తొలుత స్టోయినిస్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆతర్వాత పూరన్ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో లక్నో విజయం సాధించింది. లక్నో గెలుపు పరుగు బై రూపంలో రావడం విశేషం.
కాగా, ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోహ్లి హాఫ్‌సెంచరీ సాధించిన వెంటనే కామెంటేటర్ సైమన్ డూల్ మాట్లాడుతూ.. కోహ్లి వ్యక్తిగత రికార్డు కోసమే నెమ్మదిగా ఆడాడు అన్న అర్ధం వచ్చేలా వివాదాస్పద కామెంట్స్ చేశాడు.
25 బంతుల్లో 42 పరుగులు చేసిన కోహ్లి, మరో 8 పరుగులు చేసేందుకు 10 బంతులు తీసుకున్నాడు.. బుల్లెట్ ట్రైన్‌లా స్టార్ట్ చేసి, నత్తలా ఫిఫ్టి పూర్తి చేశాడని డౌల్ వ్యాఖ్యానించాడు. డౌల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నాయి. కోహ్లి వ్యతిరేక కామెంట్లు చేసినందుకు గాను అతని అభిమానులు డౌల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. కనీస క్రికెట్ పరిజ్ఞానం లేని వారిని కామెంట్రీ బాక్స్‌లో కూర్చోబెడితే ఇలాగే ఉంటుందంటూ డౌల్ దుమ్మదులుపుతున్నారు.
కోహ్లి చేసిన మొదటి 42 పరుగులు పవర్ ప్లేలో చేసినవని, ఆతర్వాత కూడా అలాగే ఆడాలంటే ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నిస్తున్నారు. కోహ్లి వ్యతిరేక వర్గం మాత్రం డౌల్ స్టేట్‌మెంట్‌ను సమర్ధిస్తూ, అతనికి అనుకూల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు కాదు కెరీర్ ఆరంభం నుంచి కోహ్లి ఇంతే, కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడంటూ కోహ్లిపై అక్కసును వెళ్లగక్కుతున్నారు. మొత్తానికి డౌల్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో కోహ్లి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అగ్గి రాజేశాయి.
Comments
Please login to add a commentAdd a comment