కోహ్లి పెద్ద మనసు.. మాజీ క్రికెటర్‌ తల్లికి సాయం | Virat Kohli Helps Former India Women Cricketer Mother For Covid Treatment | Sakshi
Sakshi News home page

కోహ్లి పెద్ద మనసు.. మాజీ క్రికెటర్‌ తల్లికి సాయం

Published Wed, May 19 2021 5:12 PM | Last Updated on Wed, May 19 2021 9:09 PM

Virat Kohli Helps Former India Women Cricketer Mother For Covid Treatment - Sakshi

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన పెద్ద మనసును చాటుకున్నాడు.  మాజీ మహిళా క్రికెటర్‌ తల్లి కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం తన వంతు సాయం అందిచాడు. విషయంలోకి వెళితే.. టీమిండియా మాజీ మహిళ క్రికెటర్‌.. హైదరాబాద్‌ ప్లేయర్‌ స్రవంతి నాయుడు  తల్లి కరోనా ఎస్‌కే సుమన్‌ ఇటీవలే కరోనా బారీన పడ్డారు. ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. తన తల్లి చికిత్సకు సంబంధించి సాయం చేయాలంటూ స్రవంతి బీసీసీఐతో పాటు హెచ్‌సీఏ, ఇతర క్రీడా సంస్థలకు అప్పీల్‌ చేసింది. అదే సమయంలో తన తల్లి క్లిష్ట పరిస్థితిని వివరిస్తూ స్రవంతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చిన వార్త చాలా మందిని కదిలించింది.

ఈ నేపథ్యంలోనే బీసీసీఐ మాజీ సౌత్‌జోన్‌ కన్వీనర్‌ ఎన్‌ విజయా యాదవ్‌ స్రవంతి పోస్టును షేర్‌ చేస్తూ కోహ్లికి ట్యాగ్‌ చేసింది. స్రవంతి తల్లికి కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ పేరిట ఇప్పటికే రూ. 16 లక్షలు ఖర్చు అయిందని.. తనకు తెలిసిన వారిని సాయం అడుగుతుందని పోస్టులో పేర్కొంది. విజయా యాదవ్‌ పోస్టుకు స్పందించిన కోహ్లి స్రవంతి తల్లికి సాయంగా రూ. 6.77 లక్షలు సాయంగా అందిస్తున్నట్లు తెలిపాడు. అటు హెచ్‌సీఏ కూడా స్రవంతి అభ్యర్థన మేరకు ఆమె తల్లి చికిత్సకు రూ. 5 లక్షలు సాయం అందించినట్లు విజయా యాదవ్‌ తెలిపింది. అలాగే స్రవంతి తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన స్టోరీతో చాలా మంది ఆమెకు అండగా నిలుస్తున్నారు. కాగా స్రవంతి నాయుడు టీమిండియా తరపున 1 టెస్టు, 4 వన్డేలు, 6 టీ20 మ్యాచ్‌లు ఆడింది.

ఇక కరోనాపై పోరులో భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ తమ వంతుగా ఇద్దరి తరఫున రూ. 2 కోట్లు విరాళం  ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘కెట్టో’ ద్వారా కనీసం రూ. 7 కోట్ల విరాళాన్ని ఇతరుల నుంచి సేకరించాలని వీరిద్దరు నిర్ణయించారు. ‘విరుష్క’ విజ్ఞప్తికి అద్భుత స్పందన వచ్చింది. గడువు ముగిసేందుకు మరో రెండు రోజుల సమయం ఉందనగా ఇప్పటికి ‘విరుష్క’ విరాళాల సేకరణ మొత్తం రూ. 11 కోట్లకు చేరువగా వచ్చింది. ఇందులో ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ విరాళం రూ. 5 కోట్లు ఉండటం విశేషం. వసూలైన మొత్తాన్ని విరుష్క ‘ఏసీటీ గ్రాంట్స్‌’ అనే సంస్థకు అందిస్తారు.
చదవండి: బ్లైండ్‌ డేట్‌.. ఐదు నిమిషాల్లోనే పారిపోయాను: కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement