
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి కాస్త గందరగోళానికి కేంద్రంగా మారాడు. మైదానంలోకి దిగినప్పుడు అతను వేసుకున్న జెర్సీ సహచరుల జెర్సీకంటే భిన్నంగా ఉండటంతో సమస్య మొదలైంది. సాధారణంగా టీమ్ కిట్ స్పాన్సర్ ‘అడిడాస్’కు సంబంధించిన మూడు అడ్డగీతలు మన ఆటగాళ్ల జెర్సీల భుజాలపై తెల్ల రంగులో కనిపిస్తాయి.
కానీ వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన జెర్సీపై త్రివర్ణ పతాకాన్ని పోలిన రంగులతో ఈ గీతలు కనిపిస్తాయి. అయితే కోహ్లి తెలుపు గీతల టీ షర్ట్‌తోనే వచ్చేశాడు. ఆరు ఓవర్లు ముగిసేవరకు దీనిని ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత విషయం తెలియడంతో కోహ్లి ఏడో ఓవర్‌లో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి జెర్సీని మార్చుకొని తర్వాతి ఓవర్లో గ్రౌండ్‌లోకి వచ్చాడు.