
టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా టీమిండియా నిలిచింది. బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. రెండో సారి టీ20 వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగల్గింది.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో సత్తాచాటగా.. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇక బ్యాటింగ్‌లో ఈ టోర్నీలో పెద్దగా రాణించని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలకమైన ఫైనల్లో సత్తాచాటాడు. టైటిల్ పోరులో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
అయితే ఈ విజయనంతరం విరాట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తనకు చివరి టీ20 అని కోహ్లి తెలిపాడు.
"మేము సాధించాలనుకున్నది ఇదే. ఈ రోజు మా కల నేరవేరింది. ఈ క్షణం కోసం చాలా కాలం నుంచి వేచి ఉన్నాం. నిజంగా చాలా సంతోషం ఉంది. ఏమి మాట్లాడాలో ఆర్ధం కావడం లేదు. ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవడానికి గత 11 ఏళ్లగా శ్రమిస్తున్నాం. భారత్ తరఫున ఇదే నా చివరి టీ20. కుర్రాళ్లకు అవకాశమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఇక ఈ విజయానికి కెప్టెన్‌గా రోహిత్ శర్మ అర్హుడు. రోహిత్ శర్మ 9 టీ20 ప్రపంచ కప్‌లు ఆడాడు. ఇది నాకు ఆరో ప్రపంచ కప్. అత్యున్నత స్దాయిలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం చాలా గర్వంగా ఉందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కోహ్లి పేర్కొన్నాడు.
కోహ్లి 2010లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేశాడు. తన టీ20 కెరీర్‌లో ఇప్పటి వరకు 124 మ్యాచ్ ఆడిన విరాట్... 48.38 సగటుతో 4112 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.