కోహ్లి మరోసారి విఫలం.. కష్టాల్లో టీమిండియా! అద్భుతం జరిగితేనే.. | Virat Kohli Suffers Twin Failures in Adelaide Fans React Falls Cheaply again | Sakshi
Sakshi News home page

కోహ్లి మరోసారి విఫలం.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా: అద్భుతం జరిగితేనే..

Published Sat, Dec 7 2024 5:33 PM | Last Updated on Sat, Dec 7 2024 6:15 PM

Virat Kohli Suffers Twin Failures in Adelaide Fans React Falls Cheaply again

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా కీలక బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో సెంచరీ కొట్టి మురిపించిన ఈ రన్‌మెషీన్‌.. అడిలైడ్‌లో మాత్రం తేలిపోయాడు. పింక్ బాల్‌ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఏడు పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులకే నిష్క్రమించాడు.

అజేయ శతకంతో అలరించి
ఈ నేపథ్యంలో కోహ్లి నిలకడలేమి ఫామ్‌పై మరోసారి విమర్శలు వస్తున్నాయి. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టు.. పెర్త్‌ టెస్టులో గెలిచి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకం బాదాడు కోహ్లి.

యువ ఆటగాళ్ల  కంటే కూడా దారుణంగా
టెస్టుల్లో ముప్పైవ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ పరుగుల యంత్రం అడిలైడ్‌లోనూ రాణిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లో యువ ఆటగాళ్ల కంటే కూడా కోహ్లి ఘోరంగా వైఫల్యం చెందాడు. ఈ క్రమంలో 180 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడుతోంది.

కనీసం ఇప్పుడైనా కోహ్లి ఆదుకుంటాడేమోనని భావిస్తే ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. నిజానికి అడిలైడ్‌లో ఆరంభం నుంచి కోహ్లి కాస్త జాగ్రత్తగానే ఆడాడు. చీకట్లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్‌ బాల్‌ను ఎదుర్కొనే క్రమంలో.. అవుట్‌సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ దిశగా వచ్చిన బంతులను కోహ్లి వదిలేశాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్లో ఆసీస్‌ పేసర్‌ స్కాట్‌ బోలాండ్‌ వేసిన బంతిని బౌండరీకి తరలించి.. టచ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు.

కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగిన కోహ్లి
అయితే, బోలాండ్‌ చేతికే కోహ్లి చిక్కడం గమనార్హం. పదిహేనవ ఓవర్‌ మూడో బంతి ఆఫ్‌ స్టంప్‌ దిశగా రాగా.. షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి కోహ్లి విఫలమయ్యాడు. బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకిన బంతి వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ చేతుల్లో పడటంతో కోహ్లి ఇన్నింగ్స్‌ ముగిసింది. మొత్తంగా 21 బంతులు ఎదుర్కొని 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి పెవిలియన్‌ చేరాడు.

కష్టాల్లో టీమిండియా
ఇక శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌(24) ఫర్వాలేదనిపించగా.. కేఎల్‌ రాహుల్‌(7) విఫలమయ్యాడు. శుబ్‌మన్‌ గిల్‌(28) రాణించగా.. కోహ్లి(11), రోహిత్‌ శర్మ(6) నిరాశపరిచారు. ఆట ముగిసే సరికి రిషభ్‌ పంత్‌ 28, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఆసీస్‌ కంటే(తొలి ఇన్నింగ్స్‌) టీమిండియా ఇంకా 29 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు ఏదైనా అద్భుతం జరిగితేనే టీమిండియా ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకుంటుంది. లేదంటే.. ఘోర పరాభవం తప్పదు. ఇక రెండో రోజు ఆటలో ఆసీస్‌ పేసర్లలో ప్యాట్‌ కమిన్స్‌, స్కాట్‌ బోలాండ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మిచెల్‌ స్టార్క్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

టీమిండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా రెండో టెస్టు
వేదిక: అడిలైడ్‌ ఓవల్‌ మైదానం, అడిలైడ్‌- పింక్‌ బాల్‌ టెస్టు- డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌
టాస్‌: టీమిండియా.. బ్యాటింగ్‌
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 180
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 337
రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు: 128/5 (24).

చదవండి: అద్భుత యార్కర్‌తో సెంచరీ వీరుడికి చెక్‌!.. సిరాజ్‌ ఉగ్రరూపం చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement