ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్, ఆర్సీబీ విధ్వంసకర ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. టీ20 బ్లాస్ట్-2023 కోసం వార్విక్‌షైర్ మ్యాక్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాక్స్‌వెల్ రాబోయే సీజన్‌లో వార్విక్‌షైర్ తరఫున ఆడనున్న రెండో ఫారిన్ ప్లేయర్ కానున్నాడు. కొద్ది రోజుల కిందటే వార్విక్‌షైర్ పాక్ పేసర్ హసన్ అలీతో డీల్ ఓకే చేసుకుంది.
మ్యాక్స్‌వెల్‌తో ఒప్పందాన్ని ధృవీకరిస్తూ వార్విక్‌షైర్ క్లబ్ నిన్న (ఫిబ్రవరి 14) ఓ ప్రకటనను విడుదల చేసింది. మ్యాక్సీ ఎంపికపై వార్విక్‌షైర్ హెడ్ కోచ్ మార్క్ రాబిన్సన్ స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఉన్న హార్డ్ హిట్టర్స్‌లో ఒకరైన మ్యాక్స్‌వెల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా అనందాన్ని కలిగిస్తుందని అని అన్నాడు. టీ20ల్లో మ్యాక్సీ ఓ పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ అని కొనియాడాడు.
అతని పవర్ హిట్టింగ్, వైవిధ్యమైన ఆటతీరు తమ క్లబ్ అభిమానులను తప్పక ఎంటర్‌టైన్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మ్యాక్సీ ఆడే షాట్లకు ప్రత్యర్ధి జట్లు ఫీల్డింగ్ సెట్ చేయలేక నానా కష్టాలు పడతారని అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు మ్యాక్సీ ఫీల్డింగ్ సామర్థ్యం తమ క్లబ్‌కు అదనపు బలంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ ముగిసిన వెంటనే మ్యాక్స్‌వెల్ తమతో కలుస్తాడని పేర్కొన్నాడు. ఈ డీల్‌పై మ్యాక్స్‌వెల్ కూడా స్పందించాడు. వార్విక్‌షైర్ బేర్స్ తరఫున కొత్త ఛాలెంజ్ స్వీకరించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. టీ20 క్రికెట్ ఆడేందుకు ఎడ్జ్‌బాస్టన్ ఓ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకొచ్చాడు.
కాగా, కాలు ఫ్రాక్చర్ కారణంగా గత 3 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మ్యాక్సీ.. ఈ ఏడాది ఇప్పటివరకు ఏ ఫార్మాట్‌లోనూ ఆడలేదు. ఐపీఎల్‌కు ముందు అతను జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు ఉంటాయి. 34 ఏళ్ల మ్యాక్స్‌వెల్ తన టీ20 కెరీర్‌లో 350కి పైగా మ్యాచ్‌ల్లో 150కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు.
ప్రపంచ క్రికెట్‌లో మ్యాక్సీ ఓ విధ్వంసకర బ్యాటర్‌గా చలామణి అవుతున్నాడు. జాతీయ జట్టుతో పాటు పలు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనే మ్యాక్స్‌వెల్.. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో అతను ఇంగ్లండ్ కౌంటీల్లో హ్యాంప్‌షైర్, సర్రే, యార్క్‌షైర్, లాంకాషైర్ క్లబ్‌ల తరఫున ఆడాడు. ఆస్ట్రేలియా తరఫున మ్యాక్సీ.. 7 టెస్ట్‌లు, 127 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో అతను వివిధ జట్ల తరఫున 110 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment