Asia Cup 2023 Final: ఆసియా కప్-2023 ఫైనల్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌తో ఈ స్పిన్ ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించినట్లు సమాచారం.
లంకకు బయల్దేరిన యువ క్రికెటర్
ఈ క్రమంలో చెన్నై ఆటగాడు సుందర్ ఇప్పటికే శ్రీలంకు బయల్దేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘అక్షర్‌ను గాయాలు వేధిస్తున్నాయి. చిటికిన వేలికి గాయమైంది. ముంజేయికి కూడా దెబ్బతగిలింది.
వాషీని ఎయిర్‌పోర్టులో చూశానన్న డీకే
అంతేకాదు.. తొడ కండరాలు పట్టేశాయి కూడా. అందుకే వాషింగ్టన్‌ను శ్రీలంకకు పిలిపిస్తున్నారు’’ అని పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సైతం సుందర్ ప్రయాణం గురించి హింట్ ఇచ్చాడు.
‘‘ఎయిర్‌పోర్టులో అనుకోకుండా.. నాకు వాషింగ్టన్ సుందర్ తారసపడ్డాడు. అతడికి ఎక్కడికి వెళ్తున్నాడో గెస్ చేయండి’’ అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తర్వాత విలేకరులతో మాట్లాడిన టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. అక్షర్ గాయాలు అంత తీవ్రమైనవి కావని పేర్కొనడం గమనార్హం.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అక్షర్ పోరాటం
కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన శుక్రవారం నాటి మ్యాచ్‌లో అక్షర్ పటేల్ 34 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు.
అంతకుముందు బంగ్లా ఇన్నింగ్స్‌లో 9 ఓవర్ల బౌలింగ్‌లో 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. గాయాల తీవ్రత ఎక్కువైతే మాత్రం వన్డే వరల్డ్‌కప్-2023కి కూడా అక్షర్ పటేల్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
వన్డేల్లో సుందర్ గణాంకాలు
ఇక యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడాడు. 16 వికెట్లు తీయడంతో పాటు 233 పరుగులు సాధించాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో చివరిగా వన్డే ఆడాడు. కాగా ఆదివారం (సెప్టెంబరు 17) టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
చదవండి: అతడిని కాదని నీకు ఛాన్స్.. ‘రాక రాక’ వచ్చిన అవకాశం! ఇకనైనా మారు..
Comments
Please login to add a commentAdd a comment