WC 2023- Ind vs Aus- Virat Kohli Rare Record: ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీని ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో మొదలుపెట్టింది రోహిత్ సేన.
ఇందుకు చెన్నైలోని చెపాక్ మైదానం వేదిక. ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. భారత బౌలర్లు దాటికి నిలవలేక 199 పరుగులకు ఆలౌట్ అయింది.
కోహ్లి, రాహుల్ చక్కటి భాగస్వామ్యంతో
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ.. నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ కావడంతో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కోహ్లి.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు.
అర్ద శతకాలతో చెలరేగి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించి.. విజయం దిశగా నడిపేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రన్‌మెషీన్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సాధించాడు.
సచిన్ రికార్డు బ్రేక్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డును బ్రేక్ చేసి.. నంబర్ 1 స్థానానికి ఎగబాకాడు. వైట్‌బాల్ క్రికెట్ ఐసీసీ ఈవెంట్లలో కోహ్లి ఇప్పటి వరకు 2720* పరుగులు సాధించగా.. సచిన్ 2719 రన్స్ చేశాడు.
మూడో స్థానంలో రోహిత్
ఇక ఈ జాబితాలో రోహిత్ శర్మ 2422, యువరాజ్ సింగ్ 1707, సౌరవ్ గంగూలీ 1671, మహేంద్ర సింగ్ ధోని 1492 పరుగులతో వీరి తర్వాతి స్థానాలు ఆక్రమించారు. కాగా ఈ గణాంకాలు ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీలు, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో సాధించినవి మాత్రమే!
పరిమిత ఓవర్ల టోర్నీల్లో మాత్రమే
సచిన్ టీమిండియా తరఫున ఆరు వన్డే ప్రపంచకప్‌లు ఆడగా.. కోహ్లి ప్రస్తుతం నాలుగోది ఆడుతున్నాడు. అయితే, కింగ్ కోహ్లి ఐదు టీ20 వరల్డ్‌కప్స్ సహా మూడు చాంపియన్ ట్రోఫీలు ఆడటం విశేషం. కాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో 30 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అప్పటికి కోహ్లి 60, రాహుల్ 54 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: WC 2023: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన వార్నర్.. ప్రపంచకప్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment