
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(AB De Villiers) పునరాగమనానికి రంగం సిద్ధమైంది. మరోసారి అతడు ప్రొటిస్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని డివిలియర్స్ మంగళవారం స్వయంగా ప్రకటించాడు. తాను రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.
కాగా సౌతాఫ్రికా(South Africa) తరఫున 2004లో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తనదైన బ్యాటింగ్ శైలితో లెజెండ్‌గా ఎదిగాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సౌతాఫ్రికా జట్టు కెప్టెన్‌గానూ పనిచేసిన అనుభం ఉంది. ఇక ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో 114 టెస్టు మ్యాచ్‌లు ఆడి 8765 పరుగులు చేశాడు.
అదే విధంగా 228 వన్డేల్లో కలిపి 9577 రన్స్ సాధించాడు. ఇక ప్రొటిస్ జట్టు తరఫున 78 టీ20 మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ 1672 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో డివిలియర్స్ 22 టెస్టు సెంచరీలు, 25 వన్డే శతకాలు నమోదు చేశాడు.
ఐపీఎల్‌లోనూ హవా
ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చాలా ఏళ్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుకు ఆడాడు ఏబీ డివిలియర్స్. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో మొత్తంగా 184 మ్యాచ్‌లు ఆడి.. మూడు శతకాల సాయంతో 5162 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో నలభై ఏళ్ల ఏబీ డివిలియర్స్ 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కుటుంబంతో కలిసి సమయం గడపడంతో పాటు.. సేవా కార్యక్రమాలు, బ్రాడ్‌కాస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. యూట్యూబర్‌గానూ అభిమానులకు ఎల్లప్పుడూ చేరువగా ఉంటున్న మిస్టర్ ‘360’.. కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని ఉందంటూ ఇటీవలే రీఎంట్రీ గురించి సంకేతాలు ఇచ్చాడు.
తాజాగా తన పునరాగమనాన్ని ఖరారు చేస్తూ వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(World Championship of Legends- WCL) బరిలో దిగనున్నట్లు ఏబీడీ ప్రకటించాడు. ‘‘నాలుగేళ్ల క్రితం నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను.
ఇక నాలో క్రికెట్ ఆడే కోరిక మిగిలి లేదని భావించి నా నిర్ణయాన్ని వెల్లడించాను. కాలం గడిచింది. ఇప్పుడు నా కుమారులు నాలో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. మళ్లీ క్రికెట్ ఆడేలా ప్రేరేపించారు. నా పిల్లలతో కలిసి ఆడిన ప్రతిసారి.. తిరిగి మైదానంలో దిగాలనే కోరిక బలపడింది.
అందుకే జిమ్‌కు తరచుగా వెళ్లి వ్యాయామం చేయడంతో పాటు.. నెట్స్‌లోనూ ప్రాక్టీస్ చేస్తున్నా. జూలైలో జరిగే డబ్ల్యూసీఎల్ టోర్నీకి నేను సంసిద్ధంగా ఉన్నాను’’ అని డివిలియర్స్ తెలిపాడు.
ఆరు జట్లు
కాగా డబ్ల్యూసీఎల్ ఒక ప్రీమియర్ టీ20 టోర్నమెంట్. ఇందులో రిటైర్ అయిన, నాన్- కాంట్రాక్ట్ క్రికెట్ దిగ్గజాలు ఆడతారు. గతేడాది డబ్ల్యూసీఎల్ తొలి ఎడిషన్ జరిగింది. భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇందులో పాల్గొనగా.. భారత్ మొట్టమొదటి చాంపియన్‌గా అవతరించింది.
‘సిక్సర్ల కింగ్’ యువరాజ్ సింగ్ సారథ్యంలో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఇక ఈసారి ఈ లీగ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్ బరిలోకి దిగనుండటం అదనపు ఆకర్షణ కానుంది.
కాగా ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగష్టు 2 వరకు ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 టోర్నీ జరుగనుంది. సౌతాఫ్రికా తరఫున గత సీజన్‌లో జాక్వెస్ కలిస్, హర్షల్ గిబ్స్, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్ తదితరులు బరిలోకి దిగారు.
చదవండి: Ind vs Pak: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. డబ్ల్యూసీఎల్ షెడ్యూల్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment