బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అద్బుతమైన విజయంతో ఆరంభించిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టుకు సన్నద్దమవుతోంది. డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కనబరిచి ఆసీస్‌ను చిత్తు చేయాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.
అయితే ఈ పింక్‌బాల్ టెస్టుకు ముందు కాన్‌బెర్రా వేదికగా భారత జట్టు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వామాప్ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు గురువారం కాన్‌బెర్రాలో అడుగుపెట్టింది.
గురువారం విశ్రాంతి తీసుకుని శుక్రవారం ప్రాక్టీస్‌లో టీమిండియా పాల్గోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శనివారం(నవంబర్ 30) నుంచి భారత్-ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది.
ప్రైమ్ మినిస్టర్స్ XI జట్టు ప్రకటన..
ఈ క్రమంలో 14 మంది సభ్యులతో కూడిన ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ సారథ్యం వహించనున్నాడు. అదేవిధంగా ఈ జట్టులో శామ్ కాన్స్టాస్, మాట్ రెన్షాలకు చోటు దక్కింది.
కాగా వీరిద్దరూ ఆసీస్ సీనియర్ జట్టులో ఓపెనింగ్ స్లాట్ కోసం పోటీపడుతున్నారు. మరోవైపు మహ్లీ బార్డ్‌మాన్, స్కాట్ బోలాండ్ ఇద్దరు ఫ్రంట్‌లైన్ సీమర్‌లుగా ఎంపికయ్యారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి స్కాట్ బోలాండ్ ఎంపికైనప్పటికి తొలి టెస్టులో ఆడే అవకాశం రాలేదు. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టు కేవలం ఒకే ఒక స్పిన్నర్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ జట్టులో లాయిడ్ పోప్ ఏకైక స్పిన్నర్‌గా ఉన్నాడు.
ప్రైమ్ మినిస్టర్స్ XI జట్టు ఇదే
సామ్ కాన్‌స్టాస్, మాట్ రెన్‌షా, జేడెన్ గుడ్‌విన్, ఒల్లీ డేవిస్, సామ్ హార్పర్ (వికెట్ కీపర్), జాక్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), జాక్ క్లేటన్, హన్నో జాకబ్స్, లాయిడ్ పోప్, మహ్లీ బార్డ్‌మాన్, స్కాట్ బోలాండ్
Comments
Please login to add a commentAdd a comment