
రేసులో రాజీవ్ శుక్లా, అరుణ్ ధుమల్, ఆశిష్ షెలార్
ఐసీసీ చైర్మన్ పదవి కోసం ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రయత్నాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఒక్కడి పేరే బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి భారత బోర్డులో ఆయన వారసుడు ఎవరనే చర్చ అప్పుడే మొదలైంది. ఐసీసీలో మొత్తం 16 మంది సభ్యుల్లో 15 మంది జై షాకు అనుకూలంగా ఉండటంతో చైర్మన్ పదవి ఏకగ్రీవంతో దక్కనుంది.
ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే బీసీసీఐలో రెండోసారి కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన పదవీకాలం మరో ఏడాది మిగిలుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐలో జై షా వారసుడెవరనే చర్చలో ప్రముఖంగా సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శి ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ పేర్లు తెరపైకి వచ్చాయి.
ఈ ముగ్గురిలో కీలకమైన కార్యదర్శి పదవి ఎవరిని వరిస్తుందో చూడాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఎందుకంటే ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్‌క్లే పదవీకాలం నవంబర్ 30 వరకు ఉంది. కొత్త చైర్మన్ ఎన్నిక కోసం ఈ నెల 27తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఎన్నికైన వ్యక్తి డిసెంబర్ 1 తర్వాతే పదవీ బాధ్యతలు చేపడతారు. దీంతో ఇంకో మూడు నెలల వరకు జై షా బీసీసీఐ పదవిని అట్టిపెట్టుకునే అవకాశముంది.