పాకిస్తాన్‌లో పర్యటించేందుకు భారత జట్టు ఎందుకు వెనకడుగువేస్తోందో తనకు అర్థం కావడం లేదంటున్నాడు ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్. టీమిండియా కారణంగా ఇప్పటికే ఆసియా కప్ నిర్వహణ విషయంలో తమకు ఇబ్బంది కలిగిందని.. చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఇలా చేయడం సరికాదని వాపోయాడు. ఇరు దేశాల ప్రభుత్వ పెద్దలు చర్చించి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేశాడు.
భద్రతా కారణాల వల్ల
కాగా టీమిండియా 2008లో చివరగా పాకిస్తాన్‌లో పర్యటించింది. ఇక 2013 తర్వాత దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఐసీసీ, ఆసియా కప్ ఈవెంట్లలో మాత్రమే చిరకాల ప్రత్యర్థులు ముఖాముఖి తలపడుతున్నాయి. ఇక గతేడాది ఆసియా వన్డే కప్ ఆతిథ్య హక్కులకు పాక్ దక్కించుకోగా.. భద్రతా కారణాల వల్ల తమ జట్టును అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిరాకరించింది.
ఈ క్రమంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అప్పటి అధ్యక్షుడు జై షా చొరవతో టీమిండియా మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు. ఫైనల్లో లంకను ఓడించి రోహిత్ సేన ట్రోఫీ గెలిచింది. ఇదిలా ఉంటే.. 2017 తర్వాత నిర్వహిస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య దేశంగా పాకిస్తాన్ ఎంపికైంది. అయితే, ఈసారి కూడా భారత జట్టు విషయంలో తటస్థ వేదిక గురించి చర్చ మొదలైంది.
జై షా ఐసీసీ బాస్ కావడంతో
బీసీసీఐ తమ జట్టును పాక్‌కు పంపేందుకు ససేమిరా అనగా.. పాకిస్తాన్ బోర్డు మాత్రం తాము ఈసారి వెనక్కితగ్గబోమని ఐసీసీకి స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నిక కావడంతో పాక్ బోర్డు సందిగ్దంలో పడింది. మరోవైపు.. రషీద్ లతీఫ్ వంటి మాజీ క్రికెటర్లు మాత్రం జై షా వల్లే టీమిండియా తమ దేశానికి రాబోతోందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఆస్ట్రేలియా వంటి జట్టే మా దేశ పర్యటనకు వచ్చినపుడు టీమిండియా ఎందుకు రావడం లేదు?.. ఇండియా- పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది.
మా దేశానికి వస్తే తప్పేంటి?
ఇందుకోసం ఇరు దేశాల ప్రభుత్వాల పెద్దలు కూర్చుని చర్చించాలి. అలా అయితే క్రికెట్‌కు ఎంతో మేలు చేకూరుతుంది. తొలుత ఆసియా కప్ నిర్వహణను పాక్ నుంచి లాగేసుకున్నారు. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనే అలాగే వ్యవహరిస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారు? చాలా ఏళ్ల తర్వాత మా దేశంలో ఐసీసీ టోర్నీ జరుగబోతోంది.
కానీ ఇలాంటి ఆటంకాలు వస్తే మేము ఏం చేయాలి? అయినా.. ఇండియా వెళ్లేందుకు మా ఆటగాళ్లకు మా ప్రభుత్వం అనుమతినిస్తున్నపుడు.. భారత ప్రభుత్వం ఎందుకు టీమిండియాను ఇక్కడికి పంపదు?.. దయచేసి రాజకీయాలకు అతీతంగా ఆటను చూడండి’’ అని కమ్రాన్ అక్మల్ విజ్ఞప్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment