అమ్మ, ఆవకాయ ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు అంటారు. అలాగే చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్‌ల మధ్య ఉండే రసవత్తర పోరు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఒక మ్యాచ్‌కు ఇంత క్రేజ్ ఎందుకంటే చెప్పలేం. అదేంటో గానీ ఈ రెండుజట్లు ఎదురుపడినప్పుడల్లా ప్రతీ ఒక్కరిలో దేశభక్తి పొంగొపోతుంది. గెలిస్తే సన్మానాలు, సత్కారాలు.. ఓడితే చీత్కారాలు, చెప్పుల దండలు పడడం గ్యారంటీ.
ఒకప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే మాములుగానే ఉండేది. కానీ ఎందుకో 90వ దశకంలోకి అడుగుపెట్టాకా పూర్తిగా మారిపోయింది. చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నారంటే రెండు జట్ల మధ్య పోరు కంటే రెండు దేశాల మధ్య వైరం అనేలానే అభిమానులు చూస్తున్నారు. ముఖ్యంగా 1996 వన్డే వరల్డ్‌కప్ నుంచి భారత్-పాక్ మ్యాచ్‌కు ఎనలేని క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఆ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూ వచ్చిందే తప్ప ఇసుమంతైనా తగ్గలేదు.
ఎప్పుడో 37 ఏళ్ల క్రితం... భారత్, పాకిస్తాన్ జట్లు ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య పోరును ఎవరూ పట్టించుకోని ఆ రోజుల్లో 30 వేల మంది కూడా మ్యాచ్‌కు రాలేదు. కానీ ఇప్పుడు... ఈ మ్యాచ్ రాబట్టే ఆదాయం ఏమిటో బాగా తెలిసిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంసీజీని వేదికగా మార్చింది. 90 వేల సామర్థ్యం గల మైదానంలో చాలా కాలం క్రితమే అన్ని టికెట్లు నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోయాయి. ఇదీ భారత్-పాక్ మ్యాచ్‌కున్న క్రేజ్
ఎలాగు వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు పాకిస్తాన్‌పై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాక్ టీమిండియాను ఓడించలేకపోయింది. 1992 నుంచి 2019 వరల్డ్‌కప్ వరకు పాకిస్తాన్‌తో తలపడిన సందర్భాల్లో ప్రతీసారి టీమిండియాదే విజయం. ఇక పొట్టి ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది. 2021 టి20 ప్రపంచకప్ మినహా మిగిలిన సందర్భాల్లో తలపడిన ప్రతీసారి భారత్‌దే పైచేయి.
►టి20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు ముఖాముఖిగా ఆరుసార్లు తలపడ్డాయి. ఐదుసార్లు భారత్ గెలుపొందగా, ఒకసారి పాకిస్తాన్‌ను విజయం వరించింది.
►ఎంసీజీ మైదానంలో ఇప్పటివరకు 15 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఛేజింగ్ చేసిన జట్లు తొమ్మిదిసార్లు గెలిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు నాలుగుసార్లు నెగ్గాయి. మరో మ్యాచ్ రద్దయింది. గతంలో ఈ వేదికపై భారత్ ఆడిన రెండు టి20 మ్యాచ్‌ల్లోనూ నెగ్గగా... పాకిస్తాన్ ఆడిన ఒక మ్యాచ్‌లో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment