Women Asia Cup 2022: Mother,Daughter Duo Represents Pakistan Post Viral - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: తల్లి అంపైర్‌.. కూతురు ఆల్‌రౌండర్‌.. ఇద్దరూ ఒకేసారి! వీరికి వెనుక ఉన్నది ఎవరంటే!

Published Sun, Oct 2 2022 11:19 AM | Last Updated on Sun, Oct 2 2022 12:04 PM

Womens Asia Cup 2022: Mother Daughter Duo Represents Pakistan Post Viral - Sakshi

తల్లి అంపైర్‌.. కూతురు ఆల్‌రౌండర్‌.. కైనత్‌- సలీమా(PC: Kainat Imtiaz Instagram)

అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని అంటుంటారు. నలుగురికీ భిన్నంగా ఎంచుకున్న రంగంలో అనుకున్న లక్ష్యాలు చేరాలంటే కచ్చితంగా కుటుంబం.. ముఖ్యంగా లైఫ్‌ పార్ట్‌నర్‌ ప్రోత్సాహం ఉంటేనే సాధ్యమవుతుంది. భార్యైనా.. భర్తైనా పరస్పరం సహకరించుకుంటేనే ఇటు వ్యక్తిగత.. అటు వృత్తిగత జీవితం బాగుంటుంది.

పాకిస్తాన్‌కు చెందిన తల్లీకూతుళ్లు సలీమా ఇంతియాజ్‌, కైనత్‌ ఇంతియాజ్‌కు ఇలాంటి భాగస్వాములే దొరికారు. భర్త ఖవాజా ఇంతియాజ్‌ ప్రోత్సాహంతో సలీమా అంపైర్‌గా ఎదగగా.. క్రికెటర్‌ కావాలన్న తమ కూతురు కైనత్‌ తన కలను నిజం చేసుకోవడంతో సహాయపడ్డారు ఈ దంపతులు.

ఇక తండ్రిలాగే భర్త వకార్‌ సైతం తనకు అండగా నిలుస్తూ ఉండటంతో కైనత్‌ పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. విశేషమేమిటంటే.. ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ ఇప్పుడు ఆసియా కప్‌-2022 వంటి మెగా టోర్నీలో తమ వంతు బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. 

41 ఏళ్ల వయసులో కల సాకారం
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్‌ టీ20 టోర్నీలో భాగంగా భారత్‌- శ్రీలంక మ్యాచ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్‌గా అరంగేట్రం చేసింది సలీమా. మరోవైపు సలీమా కూతురు కైనత్‌ పాకిస్తాన్‌ మహిళా జట్టులో సభ్యురాలిగా ఉంది. ఇలా ఇద్దరూ ఒకేసారి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో భాగం కావడంతో ఇంతియాజ్‌ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి.


భర్తతో కైనత్‌(PC:  Kainat Imtiaz Instagram)

నాకు గర్వకారణం.. కైనత్‌ భావోద్వేగం
ముఖ్యంగా 41 ఏళ్ల వయసులో తన తల్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాలు గుర్తుచేసు​కుంటూ కైనత్‌ ఉద్వేగానికి లోనైంది.ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా భావోద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేసింది. ‘‘ఏసీసీ ఆసియా కప్‌ -2022లో అంపైర్‌గా మా మామ్‌! మా అమ్మ సాధించిన విజయం పట్ల నాకెంతో గర్వంగా ఉంది. పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాలన్న ఆమె కల, ఆమెతో పాటు నా కల కూడా నేడు నెరవేరింది. 

మేమిద్దరం మా దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఆ భగవంతుడి దయ. మా అమ్మ ఈ స్థాయికి చేరుకోవడంలో అడుగడుగునా అండగా నిలబడ్డ మా నాన్నకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మమ్మల్ని ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. నిరాశతో మేము వెనుదిరగకుండా నిరంతరం స్ఫూర్తి నింపుతూనే ఉంటారు. మా లోపాలు సరిదిద్దే క్రమంలో తనే మొదటి క్రిటిక్‌.

వీళ్లందరూ మా జీవితాల్లో ఉండటం వల్లే
ఆయన నా తండ్రి కావడం నిజంగా నా అదృష్టం. ఈ ప్రపంచంలో అందరికంటే నేనే అదృష్టవంతురాలిని అనిపిస్తోంది. అలాగే నా సోదరుడు.. మా నాన్నలానే నన్ను ప్రోత్సహించే భర్త.. వీళ్లందరూ నా జీవితంలో ఉండటం.. నా అదృష్టం’’ అంటూ కైనత్‌ ఉద్వేగానికి లోనైంది. ఆమె పోస్టుకు స్పందించిన నెటిజన్లు.. సలీమా, కైనత్‌లకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. 

అదే విధంగా పాకిస్తాన్‌ వంటి దేశంలో కట్టుబాట్లను దాటుకుని వారు ఎదిగేలా ప్రోత్సహించిన కైనత్‌ తండ్రిని ప్రశంసిస్తున్నారు. కాగా కైనత్‌ తండ్రి ఖవాజా స్పో టీచర్‌గా పనిచేశాడు. ఇక పాక్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన కైనత్‌.. భారత మహిళా పేసర్‌ ఝులన్‌ గోస్వామి తనకు స్ఫూర్తి అంటూ 2017 వరల్డ్‌కప్‌ సందర్భంగా తన మనసులోని మాట వెల్లడించింది. ఇటీవల కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో ఆడిన పాకిస్తాన్‌ జట్టులో చోటుదక్కించుకున్న కైనత్‌.. ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీకి ఎంపికైన జట్టులో స్థానం సంపాదించుకుంది.   

చదవండి: RSWS 2022 Final: శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన ఇండియా లెజెండ్స్‌.. వరుసగా రెండోసారి
National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement