
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేసి లంకేయులను కట్టడి చేశారు.
అమేలియా కెర్, లీగ్ క్యాస్పెరెక్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఏడెన్ కార్సన్ ఓ వికెట్ దక్కించుకుంది. లంక బ్యాటర్లలో చమారీ ఆటపట్టు (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. విష్మి గౌతమ్ 8, హర్షిత మాధవి 18, కవిష దిల్హరి 10, అనుష్క సంజీవని 5, నిలాక్షి డిసిల్వ 14, అమా కాంచన 10 పరుగులు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. జార్జియా స్లిమ్మర్ (53), అమేలియా కెర్ (34) చెలరేగడంతో 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో సుజీ బేట్స్ 17, సోఫీ డివైన్ 13 పరుగులు చేశారు.
లంక బౌలర్లలో సచిని నిసంసల, చమారీ ఆటపట్టు తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఆడిన నాలుగో మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన శ్రీలంక గెలుపు రుచి చూడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment