WPL 2024: సూపర్‌ షబ్నమ్‌... | WPL 2024: Gujarat Giants Beats UP Warriorz In A Thriller, Check Score Details Inside - Sakshi
Sakshi News home page

WPL 2024: సూపర్‌ షబ్నమ్‌...

Published Tue, Mar 12 2024 1:30 AM | Last Updated on Tue, Mar 12 2024 12:40 PM

WPL 2024: Gujarat Giants beats UP Warriorz in a thriller - Sakshi

11 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన వైజాగ్‌ అమ్మాయి

గుజరాత్‌ జెయింట్స్‌కు రెండో విజయం

దీప్తి శర్మ పోరాటం వృథా

యూపీ వారియర్స్‌కు తప్పని ఓటమి

న్యూఢిల్లీ: వరుసగా మూడో మ్యాచ్‌లోనూ దీప్తి శర్మ (60 బంతుల్లో 88 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగినా... యూపీ వారియర్స్‌ను గెలిపించలేకపోయింది. ఫలితంగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో యూపీ ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 8 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెపె్టన్‌ బెత్‌ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి హాఫ్‌ సెంచరీ సాధించగా, లౌరా వోల్‌వార్ట్‌ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్‌ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వారియర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షబ్నమ్‌ షకీల్‌ (3/11) కీలక వికెట్లతో ఆరంభంలోనే యూపీని దెబ్బ తీసింది. దాంతో స్కోరు 35/5 వద్ద నిలిచింది. అయితే దీప్తి, పూనమ్‌ ఖేమ్నర్‌ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. వీరిద్దరు 78 బంతుల్లో అభేద్యంగా 109 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా, దీప్తి 2 సిక్సర్లతో సహా మొత్తం 17 పరుగులే వచ్చాయి.

పట్టికలో మూడో స్థానం కోసం ఇంకా పోటీ మిగిలే ఉంది. యూపీ, బెంగళూరుకు చెరో 6 పాయింట్లు ఉండగా, యూపీ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్‌కు అర్హత పొందుతుంది. ఒకవేళ భారీ తేడాతో ఓడిపోకున్నా బెంగళూరుకే ప్లే ఆఫ్స్‌ అవకాశం ఉంది. ఇక 4 పాయింట్లున్న గుజరాత్‌ చివరి మ్యాచ్‌లో గెలవడంతో పాటు భారీ రన్‌రేట్‌ సాధించాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement