WTC Final Day 5: Rain Threatens Play - Sakshi
Sakshi News home page

WTC Final Day 5: క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌

Published Sun, Jun 11 2023 2:50 PM | Last Updated on Sun, Jun 11 2023 4:43 PM

WTC Final Day 5: Rain Threatens Play - Sakshi

క్రికెట్‌ అభిమానులకు ఇది నిజంగా చేదు వార్త. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రసవత్తరంగా సాగుతున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ మ్యాచ్‌ చివరి రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని యూకే వాతావరణ శాఖ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేసినట్లు సమాచారం. ఐదో రోజు ఆట ప్రారంభ సమయానికి వర్షం నుంచి ఎలాంటి ముప్పు ఉండదని, మధ్యాహ్న సమయంలో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదికలో పేర్కొన్నట్లు తెలస్తోంది.

ఇదే జరిగితే ఛేజింగ్‌ చేస్తున్న టీమిండియా లయ తప్పే ప్రమాదం ఉంది. ఆసీస్‌ వర్షం అంతరాయాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని టీమిండియాపై పైచేయి సాధించవచ్చు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించినా.. ఎలాగూ రిజర్వ్‌ డే కూడా ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయం. అయితే ఈ పరిస్థితి ఆసీస్‌కు అనుకూలంగా, టీమిండియాకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే టీమిండియా అభిమానులు వర్షం రాకూడదని కోరుకుంటున్నారు. 

కాగా, 444 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్‌.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కోహ్లి (60 బంతుల్లో 44 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), రహానే (59 బంతుల్లో 20 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే, ఆఖరి రోజు మరో 280 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. అంతకుముందు ఆస్ట్రేలియా తమ  రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 270 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. 

అలెక్స్‌ క్యారీ (105 బంతుల్లో 66 నాటౌట్‌; 8 ఫోర్లు), మిచెల్‌ స్టార్క్‌ (57 బంతుల్లో 41; 7 ఫోర్లు) ఏడో వికెట్‌కు 93 పరుగులు జోడించి ఆసీస్‌కు భారీ ఆధిక్యాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు, భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. 

చదవండి: ఐదో రోజు ఆట ముందు కోహ్లీ క్రిప్టిక్ పోస్ట్.. ఎందుకు చేశాడో తెలియక!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement