గతేడాది కరోనా కారణంగా క్రికెట్ అభిమానులు కోల్పోయిన వినోదాన్ని మెగా ఈవెంట్ల రూపంలో 2021 భర్తీ చేసింది. మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలిచిన జట్టుగా న్యూజిలాండ్‌కు చారిత్రాత్మక విజయం అందిస్తే... తొలిసారిగా టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆనందాన్ని ఆస్ట్రేలియాకు పంచింది.
అయితే టీమిండియాకు కొన్ని మధురజ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాల్నీ మిగిల్చింది. ముఖ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓటమి, టీ20 వరల్డ్‌కప్-2021లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించడం అభిమానులను నిరాశకు గురిచేశాయి. కాసేపు వీటిని పక్కనపెడితే... మూడు ఫార్మాట్లలో భారత జట్టు, క్రికెటర్లు సాధించిన 5 రికార్డులపై ఓ లుక్కేద్దాం.
1.ఆసీస్ గడ్డ మీద రెండుసార్లు.. సెంచూరియన్‌లోనూ
గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించి చారిత్రక టెస్టు విజయం నమోదు చేసింది టీమిండియా. సొంతగడ్డ మీద వారిని ఓటమి రుచి చూపించి సత్తా చాటింది. అదే జోష్‌లో సిరీస్‌ను కైవసం చేసుకుని... ఆసీస్ నేలమీద రెండు సార్లు ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి టెస్టులో విజయం సాధించి సెంచూరియన్ కోట బద్దలు కొట్టింది. తద్వారా అక్కడ ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది.
2.రెండో బ్యాటర్‌గా హిట్‌మ్యాన్..
మూడు ఫార్మాట్లలో 3 వేలకు పైగా పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రస్తుత సారథి రోహిత్ శర్మ నిలిచాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టెస్టుల్లో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న హిట్‌మ్యాన్... టీ20 ప్రపంచకప్-2021లో నమీబియాతో మ్యాచ్ సందర్భంగా పొట్టి ఫార్మాట్‌లోనూ ఈ ఘనత అందుకున్నాడు. కాగా రోహిత్ శర్మ ఇప్పటి వరకు వన్డేల్లో 9205, టెస్టుల్లో 3047, అంతర్జాతీయ టీ20లలో3197 పరుగులు సాధించాడు.
3. కోహ్లిని అధిగమించిన రోహిత్!
యూఏఈ వేదికగా సాగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఓపెనర్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లి ఘనతను అధిగమించాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక సార్లు 50కి పైగా పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లి(29 సార్లు), పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(25 సార్లు) రోహిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సెంచరీలు(4) సాధించిన ఆటగాడిగా కూడా హిట్‌మ్యాన్ ముందు వరుసలో ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు(150) బాదిన హిట్టర్ల జాబితాలో మార్టిన్ గఫ్టిల్(165) తర్వాత స్థానంలో ఉన్నాడు.
4.అశూకు నిజంగా ఈ ఏడాది మధుర జ్ఞాపకమే!
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పునరాగమనం చేశాడు రవిచంద్రన్ అశ్విన్. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకుని మెరుగ్గా రాణించాడు. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు అశూ. 417 వికెట్లు పడగొట్టడం ద్వారా హర్భజన్ సింగ్ రికార్డును అధిగమించడంతో పాటుగా... భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు.
5. అక్షర్ పటేల్ అద్భుతం చేశాడు!
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కివీస్‌తో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి.. కెరీర్‌లో ఐదో సారి ఈ ఘనత సాధించాడు. తద్వారా తొలి నాలుగు టెస్టుల్లో ఎక్కువసార్లు ఐదు వికెట్లు తీసిన జాబితాలో టామ్ రిచర్డ్‌సన్, రోడ్ని హగ్‌తో కలిసి అక్షర్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక అరంగేట్ర టెస్టు నుంచి ఆడిన 4 టెస్టుల్లో అక్షర్ ప్రతీ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. చార్లీ టర్నర్ (1887లో డెబ్యూ నుంచి తొలి నాలుగు టెస్టులు), టామ్ రిచర్డ్‌సన్(1893 డెబ్యూ నుంచి తొలి నాలుగు టెస్టులు) వంటి ఆటగాళ్ల సరసన నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment