పెర్త్: టి20 ప్రపంచకప్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. గత మెగాటోర్నీ సెమీఫైనలిస్ట్ పాకిస్తాన్‌పై జింబాబ్వే సంచలన విజయం సాధించింది. గ్రూప్–2లో గురువారం జరిగిన మ్యాచ్‌లో పరుగు తేడాతో పాక్ ఓడింది. తక్కువ స్కోర్ల మ్యాచ్‌లో... అదికూడా క్రికెట్ కూన జింబాబ్వే చేతిలో ఓటమి పాకిస్తాన్ ముందుకెళ్లే అవకాశాల్ని సంక్లిష్టం చేసింది. బౌలర్లు శ్రమిస్తే ఎదురైన స్వల్ప లక్ష్యాన్ని బ్యాటర్లు నిర్లక్ష్యంగా ఆడి నిరాశను మిగిల్చారు. టాస్ నెగ్గిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.
పాక్ బౌలర్లు వసీమ్ (4/24), షాదాబ్ ఖాన్ (3/23) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. సీన్ విలియమ్స్ (28 బంతుల్లో 31; 3 ఫోర్లు) కాస్త మెరుగనిపించాడు. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటర్లు రిజ్వాన్ (14), కెప్టెన్ బాబర్ ఆజమ్ (4) చెత్త షాట్లతో నిష్క్రమించారు.
షాన్ మసూద్ (38 బంతుల్లో 44; 3 ఫోర్లు) బాగా ఆడినా ... తను కూడా నిర్లక్ష్యంగా స్టంపౌటై వికెట్‌ను పారేసుకున్నాడు. ఆఖర్లో నవాజ్ (18 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) గెలుపుపై ఆశలు పెంచి... కీలకమైన తరుణంలో పేలవమైన షాట్‌తో పెవిలియన్ చేరడం పాక్‌ను గెలవాల్సిన మ్యాచ్‌లో ముంచింది.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (3/25) పాక్ ఓటమిలో కీలకపాత్ర పోషించాడు. బ్రాడ్ ఇవాన్స్ (2/25), ముజరబాని (1/18), జాంగ్వే (1/10) జింబాబ్వే గెలుపునకు చెమటోడ్చారు. పాక్ 13 ఓవర్ల వరకు 80/3 స్కోరుతో లక్ష్యంవైపే నడిచింది. 14, 16 ఓవర్లు వేసిన రజా పాక్‌ను ఓటమి వైపు మళ్లించాడు. 14వ ఓవర్ వరుస బంతుల్లో షాదాబ్ (17), హైదర్ అలీ (0)లను అవుట్ చేశాడు.
30 బంతుల్లో 38 పరుగుల సమీకరణం పాక్‌కు సులువైందే! కానీ మళ్లీ రజా 16వ ఓవర్ వేసి క్రీజులో పాతుకుపోయిన షాన్ మసూద్‌ను స్టంపౌట్ చేశాడు. చివరకు 12 బంతుల్లో 22 పరుగుల సమీకరణం పాక్‌పై ఒత్తిడి పెంచినా... నవాజ్ 19వ ఓవర్లో సిక్సర్ కొట్టి అంతరం తగ్గించాడు. ఆట ఆఖరి మజిలీకి చేరింది. పాక్ విజయానికి 6 బంతుల్లో 11 పరుగులు అవసరమయ్యాయి. అయితే జింబాబ్వే బౌలర్ ఇవాన్స్ ఓవర్లో పాక్ 9 పరుగులే చేసింది.
Comments
Please login to add a commentAdd a comment