
హాజరుకానున్న 1.60 లక్షల మంది విద్యార్థులు
నెల్లూరు (టౌన్): వచ్చేనెల 1వ తేదీ నుంచి జూన్ నెల వరకు వరుసగా పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్‌తో ప్రారంభమయ్యే పరీక్షలు ఆయా కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్షలతో ముగియనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నారు. మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్ష జరగనుంది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను మే 18న నిర్వహించనున్నారు. ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ మే 4వ తేదీన నిర్వహించనున్నారు. మే 19 నుంచి 27 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. అదే విధంగా డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షలు మార్చి 5 నుంచి 2వ సెమిస్టర్ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు మే 2 నుంచి 5వ తేదీ వరకు ఏపీ ఆర్‌సెట్ (పీహెచ్‌డీ), మే 6న ఏపీ ఈసెట్, మే 7న ఏపీ ఐసెట్, మే 25న లాసెట్, జూన్ 5 నుంచి 7 వరకు పీజీ ఈసెట్, జూన్ 8న ఎడ్‌సెట్, జూన్ 9 నుంచి 13 వరకు పీజీ సెట్, జూన్ 25న పీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.
పరీక్షలకు 1.60 లక్షల మంది విద్యార్థులు
వరుస పరీక్షలకు జిల్లా నుంచి ఆయా కోర్సులు చదువుతున్న విద్యార్థులు దాదాపు 1.60 లక్షల మంది హాజరవుతారని అంచనా. వీరంతా ఆయా పబ్లిక్ పరీక్షలతో పాటు పోటీ పరీక్షలకు హాజరుకానున్నారు. పదవ తరగతికి సంబంధించి రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి మొత్తం 29 వేలు, ఇంటర్‌కు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు కలిపి మొత్తం 54వేల మంది హాజరుకానున్నారు. అదే విధంగా డిగ్రీకి సంబంధించి 40 వేల మంది, ఇంజినీరింగ్‌కు సంబంధించి 4 సంవత్సరాలు కలిపి 20 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలతో పాటు బీఈడీ, లాసెట్, ఎడ్ సెట్, పీజీ సెట్, డీఎస్సీ తదితర పరీక్షలకు కూడా హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment