
రూ.వంద కోట్ల ఇసుక దోపిడీకి సోమిరెడ్డి స్కెచ్
నెల్లూరు(బారకాసు): సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.వంద కోట్ల ఇసుక అక్రమ రవాణాకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్కెచ్ వేశారని అనేకసార్లు తాను చెప్పానని, నేడు అదే విషయం రుజువైందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. సోమిరెడ్డి మాత్రం తమది జమీందారి కుటుంబమని, అంతటి గొప్పవంశానికి చెందిన నేనా అవినీతికి పాల్పడేది? అంటూ సోషల్ మీడియాలోనూ, న్యూస్ ఛానల్స్‌లోనూ మాట్లాడేవారని, కానీ ఆయన మాటలకు జరుగుతున్న పనులు చూస్తే భిన్నంగా ఉన్నాయని అన్నారు. సోమవారం నెల్లూరు నగరంలోని డైకస్‌రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా సోమిరెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా మీడియాకు వివరించారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రకృతి వనరులు దోపిడీకి గురవుతున్నాయని చెప్పారు. ప్రధానంగా సూరాయపాళెం ఇసుక రీచ్ నుంచి రూ.వంద కోట్లు దోపిడీకి సోమిరెడ్డి స్కెచ్ వేశారన్నారు. ఇటీవల జిల్లా మైనింగ్ అధికారి విరువూరు వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీ, టిప్పర్లను పట్టుకున్నారని చెప్పారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి సోమిరెడ్డికి ఫోన్ చేసి జరుగుతున్న విషయాన్ని చెప్పడంతో మీరెందుకు అక్కడికి వెళ్లారని అధికారులను ఫోన్‌లోనే సోమిరెడ్డి బెదిరించారన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడకుంటే అధికారులను బెదిరించాల్సిన అవసరం సోమిరెడ్డికి ఎందుకు వచ్చిందని కాకాణి ప్రశ్నించారు. ఆయా ఇసుక రీచ్‌ల సమీపంలోని పొలాలకు వెళ్లే దారులు ఉంటే వాటికి గండికొట్టి ధ్వంసం చేసి తాము ఏర్పాటు చేసిన దారిలోనే వెళ్లాలంటూ హుకుం జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తుంటే సోమిరెడ్డి విచ్చలవిడి ఇసుక దోపిడీ తెలుస్తోందన్నారు. ఇసుక అక్రమ రవాణాపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఇప్పుడు ధైర్యం ఉంటే సోమిరెడ్డి వాటిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వేపల్లికి తాను గతంలో ఎమ్మెల్యేగానూ, రాష్ట్ర మంత్రిగానూ పనిచేశానని.. నీలాగా అధికారులను బెదిరించడం, ఇసుక అక్రమ రవాణా, దోపిడీ వంటివి ఎన్నడూ చేయలేదన్నారు. ఇరిగేషన్‌కు సంబంధించి కాలువల్లో పూడికలు తీయకుండానే బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. దీనివల్ల పొలాలకు నీరు చేరక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అనధికార బార్లను నిర్వహిస్తున్నారని ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పానన్నారు. సోమిరెడ్డి అవినీతి, అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో కలెక్టర్, ఎస్పీలు ఉన్నా లేనట్టుగా ఉందన్నారు. నియోజకవర్గంలో లేఅవుట్ వేస్తే ఎకరాకు రూ.5లక్షలు సోమిరెడ్డికి సమర్పించుకోవాలని, నెల్లూరు కార్పొరేషన్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాల్లోనైతే ఎకరాకు రూ.10లక్షలు ఇచ్చుకోవాలని ఇలా వసూలు చేస్తూ ఉన్న సోమిరెడ్డి.. తనను ఇబ్బంది పెట్టాలని అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడిన ఏ ఒక్క అధికారిని కూడా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
అధికారులను బెదిరించి
మరీ దోచుకుంటున్నారు
పూడికలు తీయకుండానే
బిల్లులు చేసుకున్నారు
సర్వేపల్లిలో అనధికార
బార్లను నిర్వహిస్తున్నారు
అధికారులకు చెప్పినా
పట్టించుకోవడం లేదు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment