గుప్తనిధుల కోసం యథేచ్ఛగా తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం యథేచ్ఛగా తవ్వకాలు

Published Wed, Feb 26 2025 7:49 AM | Last Updated on Wed, Feb 26 2025 7:44 AM

గుప్త

గుప్తనిధుల కోసం యథేచ్ఛగా తవ్వకాలు

జిల్లాలో చారిత్రాత్మకమైన కట్టడాలు, విలువైన సంపద, ఔషధ మొక్కలకు నిలయమైన ఉదయగిరి దుర్గం విధ్వంసం అయిపోతోంది. ప్రకృతి ప్రేమికులను అలరించే దుర్గం వైభవం, రూపురేఖలు కోల్పోతోంది. దుర్గంపై ఉన్న కోటకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, మహ్మదీయ వంశీయులు, ఆంగ్లేయుల పాలనా కేంద్రంగా గతంలో ఇది విరాజిల్లింది. ఈ నేపథ్యంలో కోటపై నిర్మించిన అనేక కట్టడాల కింద బంగారు ఆభరణాలు ఉంటాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా విలువైన పురాతన కట్టడాలను గుప్తునిధుల కోసం గుల్లచేశారు.

గుప్తనిధుల

ముఠాపై నిఘా పెట్టాలి

ఉదయగిరి కొండపై ఉన్న దుర్గంలో అనేక ప్రాచీన కట్టడాలున్నాయి. ఈ కట్టడాల్లో విలువైన సంపద కోసం కొంతమంది అక్రమార్కులు వేట సాగిస్తున్నారు. ప్రాచీన కట్టడాలు ధ్వంసం అవుతున్నాయి. ఇలా అయితే రాజుల కాలం నాటి పురాతన కట్టడాల సంపద భవిష్యత్‌ తరాలు చూసే అవకాశం లేదు. ఈ వారసత్వ సంపదను కాపాడుకోవాలి. గుప్త నిధులు తవ్వే ముఠాలపై అధికారులు ప్రత్యేక నిఽఘా పెట్టాలి.

– జి.ఓబులరెడ్డి,

విశ్రాంత ఎంఈఓ

ఉదయగిరి దుర్గం

ఉదయగిరి: ఉదయగిరి దుర్గంపై అనేక చారిత్రాత్మక కట్టడాలున్నాయి. అలనాటి రాచరిక పాలన అంతరించిన తర్వాత మహ్మదీయులు పాలించిన కాలంలో అనేక కట్టడాలు ధ్వంసమయ్యాయి. సంప్రదాయ కట్టడాలు నేలమట్టం చేసి మసీదులు, బురుజులుగా మార్చారు. ఈ క్రమంలో అప్పటి కట్టడాల్లో విలువైన బంగారం, వజ్రాలు స్వాహా చేశారు. అనంతరం బ్రిటిష్‌ పాలన రావడంతో వారు కూడా సంపద కోసం అన్వేషణ చేసి దోచుకున్నారనే ప్రచారం ఉంది. స్వతంత్ర భారతంలో కూడా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత గుప్తనిధుల కోసం తవ్వకాలు మరీ ఎక్కువగా సాగుతున్నాయి. సెన్సార్‌ పరికరాలతో ప్రాచీన కట్టడాల అడుగు భాగంలో ఉన్న విలువైన సంపద గుర్తించి రాత్రి వేళల్లో తవ్వకాలు సాగిస్తున్నారు.

మళ్లీ తవ్వకాలు

ఇటీవల దుర్గంపై రాత్రి వేళల్లో లైటింగ్‌ కాంతుల్లో గుప్తనిధులు కోసం తవ్వకాలు జరిగాయి. మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ సాగింది. రాత్రి వేళ దుర్గంపై కాంతులు కనిపించడంతో స్థానికులు గుప్తనిధుల ముఠా పనిగా అనుమానాలు వ్యక్తం చేశారు. మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. పోలీసు, అటవీ అధికారులు ప్రత్యేక దళంగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో గుప్తనిధుల కోసం సాగుతున్న తవ్వకాలను ఆపు చేసినట్లు సమాచారం. అయితే అక్కడ ప్రస్తుతం తవ్వకాలు జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవంటూ ఈ బృందం బుకాయించింది. పోలీసులు, అటవీ శాఖ బృందం ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టిందో మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. గతంలో కూడా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ముఠా అక్కడే మకాం పెట్టి పేలుడు సామగ్రితో తవ్వకాలు జరిపారు. ఆ ముఠాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అప్పుట్లో ఇది సంచలనంగా మారింది. పేలుడు ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక నరబలి ఇచ్చారా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే పోలీసు దర్యాప్తులో ప్రమాదంగా చెప్పినప్పటికీ, స్థానికులు మాత్రం ఇది నరబలిగానే ఇప్పటికీ అనుమానిస్తున్నారు.

అటవీ, పోలీస్‌ సిబ్బంది పాత్రపై అనుమానాలు

చారిత్రాత్మక చిహ్నాలు పెకళించేస్తూ..

మొక్కుబడిగా అటవీ శాఖ సిబ్బంది,

పోలీసుల గాలింపు

తవ్వకాల వెనుక వీరి పాత్రపై అనుమానాలు

గతంలో విలువైన

పురాతన సంపద దోపిడీ

ప్రత్యేక దర్యాప్తు అధికారులతో

నిజాలు వెలుగు చూసే అవకాశం

ఉదయగిరి దుర్గం అటవీ శాఖ పరిధిలో ఉంటుంది. ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాల్లేవు. ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అటవీ శాఖ అఽధికారులు ఘటనలు జరిగినప్పుడు నాలుగు రోజులు హడావుడి చేయడం, ఆ తర్వాత షరా మాములే. ఈ తవ్వకాల ముఠాకు మర్రిపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తితో సంబంధాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ వ్యక్తి అటవీ, పోలీసు శాఖలో ఉన్న దిగువ స్థాయి సిబ్బందితో సంబంధాలు పెట్టుకుని ఈ తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం. అటవీ, పోలీసు శాఖల్లో ఇప్పటికీ కీలకమైన సిబ్బంది గుప్తనిధుల ముఠాతో సంబంధాలు సాగిస్తున్నారు. ఈ విషయం పైస్థాయి అధికారులకు తెలిసినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీంతో అక్రమార్కులు సులువుగా తప్పించుకుంటున్నారు. ఇంటి దొంగల గుట్టు రట్టు చేయాలంటే ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపడితే అనేక వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
గుప్తనిధుల కోసం యథేచ్ఛగా తవ్వకాలు 1
1/2

గుప్తనిధుల కోసం యథేచ్ఛగా తవ్వకాలు

గుప్తనిధుల కోసం యథేచ్ఛగా తవ్వకాలు 2
2/2

గుప్తనిధుల కోసం యథేచ్ఛగా తవ్వకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement