వ్యాపారాలు పడిపోయాయి
ప్రస్తుతం బర్డ్‌ఫ్లూ భయంతో పూర్తిగా వ్యాపారాలు పడిపోయాయి. జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ లేదు. కానీ ఉభయగోదావరి జిల్లాల్లో వెలుగులోకి రావడంతో మన జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం పౌల్ట్రీ రంగం తీవ్రమైన నష్టాల్లో ఉంది. ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో తెలియడం లేదు.
–వెంకట రమణయ్య, బ్రాయిలర్ ఫార్మర్స్ అసోసియేషన్
నెల్లూరు(సెంట్రల్): బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్ వాడకాన్ని వినియోగదారులు తగ్గించడంతో చికెన్ విక్రయదారులు, పౌల్ట్రీ నిర్వాహకులు నష్టాలు చవిచూస్తున్నారు. ఇటీవల కాలంలో ఉభయగోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ వెలుగులోకి రావడం... ఆరు నెలల క్రితం జిల్లాలోనూ ఈ వ్యాధి కలకలం సృష్టించడం తెలిసిందే. తాజాగా గోదావరి జిల్లాల్లో లక్షల్లో కోళ్లు చనిపోతుండడంతో బర్డ్‌ఫ్లూ దెబ్బకి చికెన్ కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి.
విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
జిల్లాలో గత నెల వరకు చికెన్ వినియోగం బాగానే ఉండేది. వ్యాపారాలు కూడా జోరుగానే సాగేవి. ఇక ఆదివారం వచ్చిందంటే మాంసం ముక్క పళ్లెంలో ఉండాల్సిందే. జిల్లాలో చిన్నా చితకా షాపులతో కలిపి దాదాపు 5 వేలకు పైగా చికెన్ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా సాధారణ రోజుల్లో 30 వేల కేజీల నుంచి 40 వేల కేజీల వరకు విక్రయాలు జరుగుతుంటాయి. ఆదివారం ఒక్క రోజే 80 వేల నుంచి లక్ష కేజీల వరకు విక్రయాలు జరిగేవని చికెన్ వ్యాపారులు చెపుతున్నారు. ప్రస్తుతం బర్డ్‌ఫ్లూ భయంతో సాధారణ రోజుల్లో 10 వేల కేజీలు, ఆదివారాల్లో 35 వేల కేజీల వరకు విక్రయాలు జరుగుతున్నాయని చెపుతున్నారు.
ధరలు తగ్గించినా...
జిల్లాలో చికెన్ ధరలు గత నెల వరకు ౖపైపెకి ఎగబాకే పరిస్థితి ఉండేది. గత నెలలో స్కిన్‌లెస్ బ్రాయిలర్ కేజీ మాంసం రూ.300కి చేరువలో ఉండేది. రెండు వారాల క్రితం వరకు స్కిన్ లెస్ కేజీ రూ.260కి చేరువలో ఉండేది. కాని ప్రస్తుతం బర్డ్‌ఫ్లూ భయంతో విక్రయాలు తగ్గాయి. దీంతో పౌల్ట్రీ వ్యాపారులు కూడా ధరలు తగ్గించాలని నిర్ణయించి బ్రాయిలర్ స్కిన్‌లెస్ ధర కేజీ రూ.190కి విక్రయాలు చేస్తున్నారు. అయినా వైరస్ భయంతో చాలా వరకు విక్రయాలు తగ్గుముఖం పట్టాయని వాపోతున్నారు.
చర్యలు శూన్యమే...
బర్డ్‌ఫ్లూ దెబ్బకి జిల్లాలోని పౌల్ట్రీరంగంపై తీవ్ర ప్రభావం చూపినా ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన తరువాత అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బర్డ్‌ఫ్లూ వెలుగులోకి వచ్చిన తరువాత వెంటనే చర్యలు తీసుకుని ఉంటే కొంత నష్ట నివారణ చేసే అవకాశం ఉండేదని పౌల్ట్రీ వ్యాపారులు వాపోతున్నారు.
బర్డ్‌ఫ్లూ భయంతో తగ్గిన వినియోగం
గతంలో సాధారణ రోజుల్లో నిత్యం
30 వేల నుంచి 40 వేల కేజీల విక్రయాలు
ప్రస్తుతం 10 వేల కేజీలకు పరిమితం
Comments
Please login to add a commentAdd a comment